ప్రత్యేకహోదా: పవన్‌కళ్యాణ్‌పై తెలంగాణ ఎఫెక్టా, బీజేపీ దారిలో బాబు?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత భూమి పైన స్పందించిన స్థాయిలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడటం లేదనే చెప్పవచ్చు. రాజధాని ప్రాంతంలో రైతుల నుండి భూమిని బలవంతంగా తీసుకుంటే తాను రంగంలోకి దిగుతానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును పవన్ పలుమార్లు హెచ్చరించారు.
అయితే, ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ఆయన స్పందన అంతగా లేదనే చెప్పవచ్చు. దీనికి ఎవరికి వారు అనేక కారణాలను చెబుకుంటున్నారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. ఆ రాష్ట్రం కూడా అడుగుతుందని, కాబట్టి ఆ తర్వాత ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చునని గతంలో వాదనలు వినిపించాయి. ఆ నమ్మకంతోనే పవన్ మౌనంగా ఉన్నారేమోనని అంటున్నారు.
అదే సమయంలో.. మరికొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీ రాజధాని ప్రాంత రైతుల విషయంలో పవన్ పదేపదే స్పందిస్తున్నారు. నేరుగా రాజధాని ప్రాంత రైతుల వద్దకు వెళ్లి వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అన్న విధంగానే అతను చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
బీజేపీ పైన విశ్వాసం ఉన్నప్పటికీ... ప్రత్యేక హోదా గురించి ఎవరు నిలదీసినా స్పందించడం లేదు. దాని పైన పెదవి విప్పడం లేదు. కాంగ్రెస్, నటుడు శివాజీలు పవన్ బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన స్పందించలేదు. పవన్ ప్రత్యేక హోదా పైన అంత స్థాయిలో స్పందించకపోవడానికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని బీహార్, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఎన్నో డిమాండ్ చేస్తున్నాయి. ఏపీకి హోదా ఇవ్వవద్దని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ నేతలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా వద్దని, ఇస్తే తమకూ ఇవ్వాలంటున్నారు.
ఇక్కడే పవన్ కళ్యాణ్ మౌనం దాల్చుకుండవచ్చునని అంటున్నారు. న్యాయమైన డిమాండ్ అయినప్పటికీ... ఇప్పుడు ఏపీ కోసం పవన్ పెదవి విప్పితే, తర్వాత తెలంగాణ అదే హోదా కోసం డిమాండ్ చేస్తే, అప్పుడు మాట్లాడకుంటే అది విమర్శలకు దారి తీయవచ్చునని, అందుకే పవన్ మాట్లాడలేకపోతున్నారేమో అనే చర్చ సాగుతోంది.
మరోవైపు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా పైన రివర్స్ గేర్ వేసినట్లుగా కనిపిస్తోంది. అయితే, ప్రత్యేక ప్యాకేజీ కంటే.. ఎక్కువ నిధులు కేంద్రం నుండి రాబట్టడమే చంద్రబాబు ధ్యేయంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే.. ప్రత్యేక హోదా వస్తే అన్ని సమస్యలు తీరిపోతాయా అని ఆయన ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
హోదా కంటే.. ఏపీని మిగతా రాష్ట్రాలతో సమానంగా వచ్చే వరకు కేంద్రం సహకరించడమే కావాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు రెండు రోజులుగా కేంద్రమంత్రులను కలిసి ప్రాజెక్టులు, ప్రత్యేక నిధుల కోసం విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక హోదా లేకపోయినప్పటికీ.. ప్రత్యేకంగా నిధులు వచ్చి ఏపీ అభివృద్ధికి దోహదపడితే చాలని చంద్రబాబు ఉద్దేశ్యంగా కనిపిస్తోందని అంటున్నారు. బీజేపీ నేతలు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్నారు. అయితే, అది ఎప్పుడు ఇస్తామో తెలియదంటున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు డిమాండ్ చేసే అవకాశమున్న నేపథ్యంలో.. దానికి బదులు అదే స్థాయిలో సాయం మాత్రం చేయాలని, దానికి ప్రత్యేక హోదా ట్యాగ్ మాత్రం తగిలించవద్దని బీజేపీ భావించినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే దారిలోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications