అక్రమ సంబంధం: మూగ భర్తను చంపేసిన భార్య కట్టుకథలు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఇటీవల జరిగిన మూగ వ్యక్తి బుల్లా రవి (35) హత్య కేసు మిస్టరీ వీడింది.
గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఇటీవల జరిగిన మూగ వ్యక్తి బుల్లా రవి (35) హత్య కేసు మిస్టరీ వీడింది. నిందితులైన హతుని భార్య, ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్టు మంగళగిరి డీఎస్పీ గోగినేని రామాంజనేయులు వెల్లడించారు.
మంగళవారం తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కృష్ణాయపాలెంకు చెందిన మృతుడు రవి భార్య రాణికి, తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన కిరణ్ అనే యువకుడికి మధ్య కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో రాణి ఎలాగైనా తన భర్తను వదిలించుకోవాలన్న ఆలోచనతో ప్రియుడు కిరణ్‌తో కలిసి పక్కాగా ప్లాన్ చేసి హత్య చేసిందని తెలిపారు.

ఈ నెల 14న ఉదయం రాణి, రవి ఇద్దరూ పెనుమాకలోని పంట పొలాలకు వెళ్లి పని చేస్తున్నారని, అదే సమయంలో రాణి ప్రియుడు కిరణ్ అక్కడకు వచ్చి రవితో ఘర్షణ పడ్డాడని, రాణి, కిరణ్‌లు ఇద్దరూ రాయితో రవిని కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు.
అయితే రాణీ ఏమి తెలియనట్లు కృష్ణాయపాలెం వెళ్లి తన భర్తను నలుగురు వ్యక్తులు గాయపరిచి హత్య చేశారని కట్టు కథ అల్లిందని, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి విషయాన్ని విచారించగా రాణి, కిరణ్‌ల మధ్య ఉన్న సంబంధం వెలుగు చూసిందని చెప్పారు.
దీంతో వీరిద్దరిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా వారు నేరాన్ని అంగీకరించారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాణి, కిరణ్‌లను అరెస్టు చేసినట్టు డీఎస్పీ రామాంజనేయులు చెప్పారు.












Click it and Unblock the Notifications