ఏపీ ముందస్తును తేల్చనున్న ఎమ్మెల్సీ పోరు ? ఈ ఏడాది మిస్సైతే 2025లోనే ! కీలక సమీకరణమిదే !
ఏపీలో సీఎం జగన్ తాజా ఢిల్లీ టూర్ తర్వాత ముందస్తు ఎన్నికల ఊహాగానాలు మరింత పెరిగాయి. త్వరలో నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న జగన్ సర్కార్.. షెడ్యూల్ ప్రకారం 2024లో జరగాల్సిన ఎన్నికలను కనీసం ఆరునెలలు ముందుకు జరిపేందుకు కేంద్రం అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న ఉత్కంఠ పెరుగుతోంది. అయితే ఈ ఏడాది జరిగే మండలి ఎన్నికలు ఈ సమీకరణాన్ని నిర్ణయించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఏపీలో ముందస్తు ప్రచారం
ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. గతేడాది వైసీపీ మొదలుపెట్టిన ఎన్నికల వ్యూహాలతో ఈ ప్రచారం మొగ్గతొడిగింది. ఆ తర్వాత విపక్షాలు కూడా దీనిపై అగ్గి రాజేశాయి. వైసీపీ కంటే ఓ అడుగు ముందుకు ఉండాలన్న కాంక్షతో విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వరుస టూర్లు చేపట్టారు. దీంతో వైసీపీకి వ్యతిరేకంగా వీరు సాగిస్తున్న ప్రచారం ఎన్నికల తరహాగా మారిపోయింది. అదే సమయంలో సీఎం జగన్ కూడా సంక్షేమ కార్యక్రమాల పంపిణీ కోసం పెడుతున్న సభల్ని ఎన్నికల సభలుగా మార్చేసుకుంటున్నారు. దీంతో ముందస్తు ఎన్నికలకు ఆయన ఏ రేంజ్ లో సిద్ధమవుతున్నారో ఇట్టే అర్ధమవుతోంది.

ఈ ఏడాది చివర్లో జరిగే ఛాన్స్ ?
ఈ ఏడాది బడ్జెట్ వరకూ ముందస్తుపై ఏమీ మాట్లాడకూడదని అధికార వైసీపీ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత క్రమంగా ముందస్తును తెరపైకి తెచ్చే అవకాశాలున్నట్లు సొంత పార్టీ వైసీపీతో పాటు విపక్షాలు కూడా అంచనా వేసుకుంటున్నాయి. ఏప్రిల్ తర్వాత ఈ కసరత్తు మొదలవుతుందని, ఈ ఏడాది చివర్లో అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందుకు కేంద్రంలో బీజేపీ పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ కూడా మార్చిలో ముగిసే గడప గడపకూ ప్రభుత్వం తర్వాత మరో కార్యక్రమానికి సిద్ధం కావడం లేదు.

ఈ ఏడాది మండలి ఎన్నికలు
అదే సమయంలో ఈ ఏడాది ఏపీ శాసనమండలిలో ఖాళీ అయ్యే 23 స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మూడు విడతలుగా ఇవి జరగబోతున్నాయి. మార్చి 29న, మే 1న, జూలై 20న ఈ 23 మంది ఎమ్మెల్సీలు రిటైర్ కాబోతున్నారు. దీంతో ఈ మూడు విడతల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్ధుల్ని నిలబెట్టి గెలిపించుకునేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఎలాగో అసెంబ్లీతో పాటు స్ధానిక సంస్ధల్లో ఉన్న బలం దృష్ట్యా చూసుకుంటే ఈ 23 సీట్లలో కనీసం 14 సీట్లను వైసీపీ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం. అలాగే ఈ 23 మందిలో సిట్టింగ్ ల స్ధానాల్ని కూడా వైసీపీ మరోసారి గెల్చుకుంటుంది. అప్పుడు మండలిలో వైసీపీ బలం దాదాపు హాఫ్ సెంచరీకి చేరుకుంటుంది. ఆ తర్వాత 2025లో మరోసారి ఎన్నికలు ఉంటాయి. వచ్చే ఏడాది మాత్రం మండలి ఎన్నికలు లేవు.

మండలి పోరుతో ముందస్తు లింక్ ?
ఈ ఏడాది మండలి పోరులో కనీసం 14 మంది ఎమ్మెల్సీని వైసీపీ గెలిపించకోవడం ఖాయం. సిట్టింగ్ కూడా తిరిగి గెలుస్తారు కాబట్టి మండలిలో వైసీపీ బలం 46కు చేరుకునే అవకాశముంది. దీంతో విపక్షాలపై మండలిలోనూ స్పష్టమైన ఆధిక్యంలో వైసీపీ ఉంటుంది. అయితే ముందస్తు ఎన్నికలకు ఈ ఎన్నికలకు ముందు వస్తే మాత్రం వైసీపీ ఈ స్ధానాల్ని గెల్చుకునే అవకాశం ఉండదు. అలాగే వచ్చే ఏడాది మండలికి ఎన్నికలు లేవు. మళ్లీ 2025లోనే ఎమ్మెల్సీ స్ధానాలు ఖాళీ అవుతాయి. దీంతో ఈ ఏడాది మండలి ఎన్నికలు జూలై 20న పూర్తవుతాయి కాబట్టి ఆ తర్వాత అసెంబ్లీ రద్దుకు వైసీపీ సర్కార్ మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అందుకే ఈసారి ముందస్తుపై జరుగుతున్న ప్రచారంపై వైసీపీ వర్గాలు కూడా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications