మోడీ దగ్గర మళ్లీ జగన్ పరపతి పెరగబోతోందా ? లెక్కలు మార్చబోతున్న పెద్దాయన నిర్ణయం...
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో దారుణంగా కుదేలైన వైసీపీ తిరిగి పుంజుకోవడం కష్టమనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం తమకు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చిందని, ప్రజల్లో తమ ఇమేజ్ చెక్కుచెదరలేదని, కేవలం టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుతో సీట్లు సాధించలేకపోయామని చెప్పుకుంటున్నారు. అయితే జగన్ మళ్లీ తన హవా కొనసాగించేందుకు ఐదేళ్లు వేచి చూడాల్సిందేనని భావిస్తున్న తరుణంలో గుడ్ న్యూస్ అందింది.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం తరహాలోనే పొరుగున ఉన్న ఒడిశాలో నవీన్ పట్నాయక్ కూడా ఓటమి పాలయ్యారు. బీజేపీతో రహస్య పొత్తు కొనసాగించిన జగన్, పట్నాయక్ ఇద్దరినీ ప్రజలు తిరస్కరించారు. అదే సమయంలో బీజేపీకి మాత్రం ఒడిశాలో నేరుగా, ఏపీలో కూటమి రూపంలో అధికారం దక్కింది. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ఒడిశా ప్రయోజనాల కోసం బీజేపీకి మద్దతిస్తే ఆ పార్టీ కాస్తా తన పార్టీ బీజేడీని కబళించిందని భావిస్తున్న నవీన్.. ఇకపై కాషాయ పార్టీని ప్రత్యర్థిగానే చూస్తామని స్పష్టం చేశారు.

ఆంధ్రాలో జగన్ మాత్రం తాజా స్పీకర్ ఎన్నికల్లో సైతం తమతో పొత్తులో లేకపోయినా బీజేపీ నిలబెట్టిన స్పీకర్ అభ్యర్ధికి లోక్ సభలో మద్దతు ఇచ్చేశారు. దీని వెనుక కీలక కారణం ఉంది. గత ఐదేళ్లుగా రాజ్యసభలో బలం లేని బీజేపీకి నవీన్ పట్నాయక్, జగన్ రూపంలో మద్దతు లభించింది. ఇప్పుడు బీజేపీకి నవీన్ దూరం కావడంతో జగన్ కీలకంగా మారిపోయారు. రాజ్యసభలో ఏకంగా 11 మంది ఎంపీల మద్దతు ఉన్న వైసీపీ అవసరం బీజేపీకి చాలా ఉంది. దీంతో మోడీ ఎలాగో తనవైపు చూడబోతున్నారని జగన్ కు అర్దమైంది. ఈ సమయంలో లోక్ సభలోనూ మద్దతిస్తే సరి అని భావించి స్పీకర్ ఎన్నికల్లో ఉడతా భక్తిగా సాయం చేశారు. మారిన పరిస్ధితులు అంతిమంగా జగన్ ఇమేజ్ ను మరోసారి ప్రధాని మోడీ దగ్గర పెంచాయనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications