టిడిపి నేతలపై మరింత ముమ్మరం కాబోతున్న బిజెపి దాడులు?...టిడిపి వర్గాల విశ్లేషణ
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లోని టిడిపి ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ దాడులు మరింత ముమ్మరం కానున్నాయా?...ఎపి టిడిపి నేతలను టార్గెట్ చేస్తూ మరింత ఉధృతమైన యాక్షన్ ప్లాన్ ను బిజెపి జాతీయ నాయకులు అమలు చేయనున్నారా?...అంటే అవుననే అంటున్నారు టిడిపి నేతలు.
అంతేకాదు ఇటీవలి కాలంలో రాష్ట్రంలో సంభవించిన ఘటనలతో పాటు తాజాగా ఎపిలో చోటుచేసుకున్న పరిణామాలు కూడా నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. బిజెపి నేత రాం మాధవ్ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గవర్నర్ ను కలవడం వంటి ఉదంతాలే ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.అయితే బిజెపి దాడులకు భయపడేది లేదని...ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకైనా సంసిద్దంగా ఉన్నామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

బిజెపి దాడులు...ముమ్మరం
ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ప్రభుత్వంలోని ముఖ్యులు సిఎం చంద్రబాబు...ఆయన తనయుడు,మంత్రి లోకేష్ తో సహా ఆ పార్టీలోని కీలక నేతలందరినీ టార్గెట్ చేస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తమ దాడులు మరింత తీవ్రతరం చేయనుందని టిడిపి వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకు సంబంధించిన సూచనలు,సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని టిడిపి శ్రేణులు ఉదాహరణలతో సహా వివరిస్తున్నాయి. ముఖ్యంగా రాం మాధవ్ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గవర్నర్ ను కలవడం ఎపిలో ముమ్మరం కాబోతున్న బిజెపి దాడులకు సూచకాలుగా అభిప్రాయపడుతున్నారు.

ఆనాటి నుంచి...ఇలా జరిగాయి...
ఎన్డీయే నుంచి బయటకొచ్చాక ప్రధాని మోడీపై టీడీపీ సమరభేరి మోగించింది.మోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎలా మోసం చేసింది ప్రజలకు వివరిస్తూ ధర్మపోరాట దీక్షలు చేపట్టేవరకూ పరిస్థితులు వేగంగానే వెళ్లాయి. అంతేకాదు అవకాశం వచ్చినా రాకున్నా...అవసరమైతే అవకాశాన్ని సృష్టించుకొని మరీ ప్రధాని మోడీ తీరును చంద్రబాబు ఎండగట్టారు. ఆఖరికి అసెంబ్లీ సమావేశాల్లో సైతం మోడీని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు జగన్, పవన్‌తో కలిసి మోడీ ద్వయం కుట్రలు పన్నారని ఆరోపించారు. దీంతో చంద్రబాబు టార్గెట్‌గా బీజేపీ పావులు కదపడం ప్రారంభించింది. ఆ దిశలో తొలుత నిదానంగా చర్యలు ఆరంభించిన బిజెపి క్రమంగా తమ దాడులను తీవ్రతరం చేస్తోంది.

ఇలా...వరుస దాడులు
తిరుమల ప్రధాన అర్చకులు రమణదీక్షితుల అంశం మొదలుకొని...పీడీ ఎకౌంట్ల అంశం... రాయలసీమ డిక్లరేషన్ ఇలా వివిధ అంశాలను బీజేపీనే తెరమీదకు తెలస్తోందనేది టిడిపి ఆరోపణ. అంతేకాదు ప్రాంతాలవారీగా రెచ్చగొట్టేందుకు సైతం బీజేపీ పన్నాగాలు పన్నగా...టీడీపీ అంతకంటే తారా స్థాయిలో ఎదురుదాడి చేయడంతో బిజెపి వెనక్కితగ్గిందనేది టిడిపి నేతల అభిప్రాయం. అయితే ఈ క్రమంలోనే టీడీపీని దెబ్బతీసేందుకు బిజెపి తన ఫార్ములాను బయటకు తీసిందని టిడిపి నేతలు అంటున్నారు.

టిడిపి...ప్రతిఘటన
ఐటీ దాడులతో టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్రయత్నం...ఓటుకు నోటు కేసును బయటకులాగి చంద్రబాబును ఇరుకునే పెట్టాలనే యత్నం...ఇలా వరుస ప్రయత్నాల క్రమంలో టీడీపీ అంతకంటే ఉధృతంగా ఎదురుదాడికి దిగడంతో బిజెపి పప్పులు ఉడకలేదని...ఐటీ దాడులు కూడ ఆగిపోయాయని అంటున్నారు. దీంతో బిజెపి నాయకులు తాజాగా అగ్రిగోల్డ్ అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారని...అయితే తాము ఇలాంటి వాటికి వేటికీ భయపడబోమని, బిజెపి పై పోరాటానికి ఎంతకైనా సిద్ధమని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఇవే సూచనలు...టిడిపి విశ్లేషణ
త్వరలో ప్రభుత్వం మారిపోతుందని, ప్రభుత్వం ఏర్పాటులో కీలకం కాబోతున్నామని అగ్రి గోల్డ్ పై బిజెపి దీక్షా శిబిరం ప్రారంభం సందర్భంగా ఆ పార్టీ నేత రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. తాము ఇన్నాళ్లుగా చెబుతున్నట్టుగానే బీజేపీ, వైసీపీ, జనసేన మధ్య అవగాహన కుదిరింది అనడానికి రాంమాధవ్ వ్యాఖ్యలే నిదర్శనమని టీడీపీ నేతలు అంటున్నారు. అలాగే తుపాన్ బాధితులకు సాయంపై ప్రభుత్వం విఫలమైందంటూ మరోవైపు నుంచి పవన్ కళ్యాణ్ గవర్నర్ నరసింహన్‌ను కలవడం కూడా బిజెపి స్కెచ్ లో భాగమేనంటున్నారు టిడిపి నేతలు. అంతేకాదు ప్రధాని మోడీకి తానొక లేఖ రాస్తానని పవన్ చెప్పడం, తుఫాన్ విషయంలో కేంద్రాన్ని జగన్ విమర్శించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడం...ఇవన్నీ టిడిపి ముందున్నకాలంలో ఎదుర్కోబోయే దాడులకు సూచనలుగా టిడిపి నేతలు అభివర్ణిస్తున్నారు.












Click it and Unblock the Notifications