హోదా వర్సెస్ ప్యాకేజీ: జగన్ ఇలా, బాబు అలా, పవన్ మరో'సారీ'!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అటకెక్కింది. హోదా విషయంలో ఎవరికి వారు, ఏ పార్టీకి ఆ పార్టీ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపించాయి.
హోదా విషయమై టిడిపి, బిజెపిలు వెనక్కి తగ్గాయని, వైసిపి, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నాయని, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదంటున్నారు.

హోదా ఇవ్వమని తేల్చిన బీజేపీ
ప్రత్యేక హోదా పైన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని బీజేపీ బుట్ట దాఖలు చేసింది. ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని, అయితే హోదాతో సమానమైన నిధులు కేటాయిస్తామని ప్రజలకు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, నాడు వెంకయ్య గట్టిగా నిలదీసి, ఇప్పుడు హోదా రాదని, హోదా వల్ల పెద్దగా లాభం లేదని చెప్పడం ఏమిటని విపక్షాలు వైసిపి, కాంగ్రెస్, జనసేన అధినేత పవన్ నిప్పులు చెరుగుతున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి ఇబ్బందులు ఉన్నందువల్ల హోదా ప్రయోజనాలతో ప్యాకేజీ ఇస్తున్నామనేది బీజేపీ వాదన.

హోదా తీసుకు వస్తామని చెప్పి..
ప్రత్యేక హోదా తీసుకు వచ్చే బాధ్యత తమదేనని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పింది. అయితే, కేంద్రమంత్రులు హోదా పైన పరోక్షంగా స్పందించినప్పుడు.. తమ రక్తం మరుగుతోందని, హోదా పైన ఎట్టి పరిస్థితుల్లోను తగ్గేది లేదని చెప్పారు. అయితే, హోదా పైన బీజేపీ స్పష్టమైన ప్రకటన చేశాక.. హోదాతో లాభం కంటే నష్టమే ఎక్కువ అని, హోదాతో సమానమైన ప్యాకేజీ కేంద్రం ఇస్తున్నందుకు థ్యాంక్స్ అని టిడిపి చెబుతోంది. హోదా ఇవ్వనప్పటికీ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని, హోదాకు సమానమైన నిధులు ఇచ్చినప్పుడు అభ్యంతరం ఎందుకనేది టిడిపి వాదన.

రాజకీయం కోసం విపక్షాల ఆరాటం
విభజన సమయంలో, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో.. హోదా ఇస్తామని, తెస్తామని బిజెపి, టిడిపిలు గట్టిగా చెప్పాయి. ఇప్పుడు అదే విపక్షాలకు ఆయుధంగా మారింది. ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెబుతున్నాయి. ప్రత్యేక హోదాతో పారిశ్రామిక రాయితీలు రావని, హోదా సంజీవిని అని చెబుతున్నాయి. హోదా ఇచ్చేదాకా తగ్గేది లేదని చెబుతున్నాయి. అయితే, హోదాతో సమానంగా ప్యాకేజీ ఇస్తున్నప్పుడు విపక్షాల వాదనలో అర్థం లేదని, వారితి రాజకీయ ఆరాటం అని టిడిపి, బిజెపిలు మండిపడుతున్నాయి.

నాయకులు విఫలమయ్యాక వస్తానని చెప్పిన పవన్
తిరుపతి సభ తర్వాత ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఉద్యమిస్తారనే అభిప్రాయం చాలా కలిగింది. అయితే, ఆయన వెనక్కి తగ్గారని అంటున్నారు. తిరుపతి సభలో.. ఇక నుంచి ప్రతి జిల్లాలో సభ పెడతానని ప్రకటించారు. అయితే, కాకినాడ సభలో మాత్రం మరో రకంగా స్పందించారు. నేతలు విఫలమయ్యారని చెబితే తాను ఉద్యమిస్తానని చెప్పారు. వారు విఫలమయ్యారని చెప్పరు కదా అంటే దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. విఫలమైనట్లుగా ప్రజలకు అర్థమవుతుంది కదా.. అప్పుడు రంగంలోకి దిగుతానని చెప్పారు. అయితే, గతంలో రాజధాని ఇష్యూ వంటి సమస్యలు వచ్చినప్పుడు పవన్ ఎలా వచ్చి వెళ్లారో, ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications