కొత్త మొహాల్నే ఆదరిస్తున్న కోడుమూరు సీటు! వైసీపీకి హ్యాట్రిక్ ఖాయమేనా?
కర్నూలు జిల్లాలోని కర్నూలు లోక్ సభ స్ధానం పరిధిలోకి వచ్చే ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కోడుమూరు. గత నాలుగు ఎన్నికల్లో నలుగురు అభ్యర్ధుల్ని అసెంబ్లీకి పంపిన నియోజకవర్గం ఇది. ఒకప్పుడు దామోదరం సంజీవయ్య వంటి ప్రముఖుల్ని గెలిపించి అసెంబ్లీకి పంపిన చరిత్ర ఈ సీటుకు ఉంది. గతంలో కాంగ్రెస్, టీడీపీకి అండగా నిలిచిన ఈ రిజర్వుడు సీటు.. రాష్ట్ర విభజన తర్వాత మాత్రం వైసీపీకి టర్న్ అయిపోయింది.
1962లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైన కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి కర్నూలు, సీ బెలగల్, కోడుమూరు, గూడూరు మండలాలు వస్తాయి. ఓటర్లు 2 లక్షలకు పైమాటే. జనాభా పరంగా ఎస్సీలు ఎక్కువగా ఉంటారు. బీసీ, కాపు, ముస్లింలతో పాటు మిగతా కులాలు కూడా ఉంటాయి. రాజకీయంగా మాత్రం రెడ్ల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంటుంది.ఇప్పటివరకూ ఇక్కడ 13 ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 9 సార్లు (1962, 1978, 1983, 1989, 1994, 1999, 2004, 2009 ) విజయం సాధించింది. ఆ తర్వాత వైసీపీ రెండుసార్లు, టీడీపీ, స్వతంత్ర పార్టీ ఒక్కోసారి గెలిచాయి.

కోడుమూరులో భారీ సంఖ్యలో ఉన్న ఎస్సీ జనాభా గతంలో రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైసీపీకి అండగా నిలుస్తున్నారు. అయితే గతంలో డి.మునుస్వామి, శిఖామణి వంటి అభ్యర్ధులు పలుమార్లు గెలిచినా గత నాలుగు ఎన్నికల్లో చూస్తే ఎప్పటికప్పుడు కొత్త అభ్యర్ధులనే ఇక్కడి ఓటర్లు ఆదరిస్తున్నారు. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓసారి (2009), వైసీపీ రెండుసార్లు (2014, 2019) గెలిచాయి.
వైసీపీ తరఫున గత రెండు ఎన్నికల్లో మణిగాంధీ, జె.సుధాకర్ గెలిచారు. అలాగే గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కూడా తమ అభ్యర్ధుల్ని మార్చేశాయి. ఈసారి కూడా కొత్త అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వైసీపీ తరఫున మంత్రి ఆదిమూలపుసురేష్ సోదరుడు సతీష్, టీడీపీ తరఫున బొగ్గుల దస్తగిరి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు కారణంగా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నా వైసీపీ అభ్యర్ధికే గెలుపు అవకాశాలు ఉండొచ్చు.












Click it and Unblock the Notifications