జనసేన రె'ఢీ', ఇవీ సమస్యలు: పవన్ కల్యాణ్ సినిమా ఆడుతుందా?
జనసేన వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ఢీకొట్టి జనసేన అధికారంలోకి వస్తుందా అనేది సందేహమే. పవన్ కల్యాణ్‌కు అభిమానులు దండిగా ఉన్న మాట వాస్తవమే.
విజయవాడ: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధపడుతోందంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆయన ఎన్నికల బరిలోకి దిగడం ఖాయమనే అందరూ భావిస్తున్నారు. తెలుగుదేశం, బిజెపిలతో ఆయన తెగదెంపులు చేసుకున్నట్లే.
ఉభయ కమ్యూనిస్టులతో కలిసి ఆయన ఎన్నికల బరిలోకి దిగుతారని భావిస్తున్నారు. ఎన్నికల కోసం జన సైన్యాన్ని సిద్ధం కూడా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా ఆయన నియామకాలు చేపట్టారు. ఈ నియామకాల ప్రక్రియకు మంచి ప్రతిస్పందన ఉన్నట్లు చెబుతున్నారు.
జనసేన వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ఢీకొట్టి అధికారంలోకి వస్తుందా అనేది సందేహమే. ఆయనకు అభిమానులు దండిగా ఉన్న మాట వాస్తవమే. తెలుగు సినీరంగంలో ఏ హీరోకు లేని క్రేజ్ ఆయనకు ఉంది. అది పవన్ కల్యాణ్‌కు అధికారాన్ని కట్టబెడుతుందా అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితే.

జయాపజయాలపై ఇలా....
ఓడుతామా, గెలుస్తామా అనేది ముఖ్యం కాదని పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో అన్నారు. జయాపజయాల ప్రసక్తి లేకుండా యుద్ధం చేయడమే ముఖ్యమని ఆయన భావన. నాయకుడనే వాడు తన కార్యకర్తలను లేదా సైన్యాన్ని ముందుకు నడిపించడానికి విజయం సాధించి తీరుతామనే విశ్వాసాన్ని కల్పించాలి. కానీ, పవన్ కల్యాణ్ ఆ విశ్వాసం నూరిపోసే మాటలు మాట్లాడడం లేదు.

సమస్యలపై పోరాటం.....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీవ్రమైన సమస్యలపై ఆయన ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూనే ఉన్నారు. అమరావతి భూసేకరణ బాధితులను, కిడ్నీ వ్యాధి బాధితులను, మెగా ఆక్వా పార్కు బాధితులను ఆయన కలుసుకుని పోరాటానికి సిద్దమైనట్లు ప్రకటించారు. ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ ఆ సమస్యలపై తుదికంటా పోరాటం చేసిన దాఖలాలు లేవు.
Recommended Video


ట్విట్టర్ వ్యాఖ్యలే....
తన రాజకీయ ప్రకటనలకు పవన్ కల్యాణ్ ప్రధానంగా ట్విట్టర్‌ను వేదికగా మార్చుకున్నారు. ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను, తన వైఖరిని ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తూ వస్తున్నారు. ఆ మేరకు ఆయన ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఆయన రూపాంతరం చెందలేదు. అలా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ఆయన ఎప్పుడు వస్తారనే విషయంపై స్పష్టత లేదు.

రాజకీయ శూన్యత లేదు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలైతే ఉన్నాయి గానీ రాజకీయ శూన్యత లేదు. తెలుగుదేశం పార్టీతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా బలంగానే ఉన్నాయి. అధికారం చేజారకుండా ఏ విధమైన అవకాశాన్ని కూడా ప్రత్యర్థులకు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్దంగా లేదు. అధికారాన్ని సొంతం చేసుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సిద్ధంగా లేరు. ఇప్పటికే జగన్ తన వ్యూహాలకు పదను పెట్టి కార్యాచరణకు దిగారు.

రాజకీయ శూన్యత....
ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది. కాంగ్రెసు పార్టీ ఏకఛత్రాధిపత్యం నడుస్తోంది. ఇందిరా గాంధీ అనుకున్నదే జరిగేది. కాంగ్రెసు రాజకీయాలను ఎదుర్కునే సత్తా కమ్యూనిస్టులు అప్పటికే కోల్పోయారు. అందువల్ల అది ఎన్టీ రామారావుకు కలిసి వచ్చింది. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడానికి అటువంటి స్పష్టమైన రాజకీయ శూన్యత ఏదీ తెలుగు రాష్ట్రాల్లో లేదు.

చంద్రబాబుకు అనుకూలమంటూ....
చంద్రబాబుకు అనుకూలంగానే పవన్ కల్యాణ్ కార్యాచరణ ఉంటోందనే అభిప్రాయం బలంగానే ప్రజల్లోకి వెళ్లింది. బిజెపిని ఎక్కువగా టార్గెట్ చేసి, చంద్రబాబును తక్కువగా విమర్శించడం వల్ల ఆ అభిప్రాయం ముందుకు వచ్చింది. ఈ అభిప్రాయాన్ని తొలగించడానికి పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. ఇదే అభిప్రాయం కొనసాగుతూ వస్తే ఎన్నికల్లో ఆయనకు తీవ్రమైన నష్టమే జరుగుతుంది.

పవన్ కల్యాణ్
పాత రాజకీయ నేతలందరినీ పవన్ కల్యాణ్ పక్కన పెడుతారని, కొత్తవారికి మాత్రమే అవకాశం ఇస్తారని అంటున్నారు. అంటే, రాజకీయాల్లో కాకలు తీరినవారికి ఎవరికి కూడా జనసేన పార్టీలో అవకాశం ఉండదని అనిపిస్తోంది. తన పార్టీ తరఫున పోటీ చేసే కొత్తవారికి రాజకీయాల్లో కాకలు తీరిన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదు. కొత్తవారికి రాజకీయాల పట్ల, రాజకీయ సమీకరణాల పట్ల, సామాజిక కూర్పు మీద, తదితర విషయాల మీద అవగాహన ఉండే అవకాశం లేదు. అందువల్ల పోల్ మేనేజ్‌మెంట్ అనేది జనసేన పార్టీని తీవ్రంగా దెబ్బ తీసే ప్రమాదం ఉంది.

ప్రజారాజ్యం లాగే.....
పవన్ కల్యాణ్ జనసేన కార్యకలాపాలు కూడా ఆయన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపనకు భిన్నంగా ఏమీ లేవు. ఆయన తీవ్రమైన ఉత్కంఠకు ఊపిరి పోసి, చివరకు భారీ బహిరంగ సభలో పార్టీని ప్రకటించారు. పవన్ కల్యాణ్ కాస్తా భిన్నంగా పార్టీని ప్రకటించి, తాను ఎన్నికల బరిలోకి దిగుతానని చెప్పారు. సమస్యలపై అప్పుడప్పుడు పోరాటాలు చేస్తున్నారు. చిరంజీవి మాదిరిగానే దాదాపుగా పవన్ కల్యాణ్ కూడా తన అభిమానుల మీదనే ఆధారపడినట్లు కనిపిస్తున్నారు.

ఇలాగే సాగితే....
పవన్ కల్యాణ్ జనసేన కార్యకలాపాలు ఇలాగే సాగుతూ పోతే, వచ్చే ఎన్నికల్లో అది విజయం సాధించడం చాలా కష్టం. ఆయన పోటీ అటు తెలుగుదేశం పార్టీకో, ఇటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకో ఉపయోగపడవచ్చు. ఏ పార్టీకి ఉపయోగపడుతారనేది ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు. 2009 ఎన్నికల్లో చిరంజీవి, జయప్రకాష్ నారాయణలు కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడినట్లు జనసేన ఏదో ఒక పార్టీకి ఓట్లు చీల్చడం ద్వారా ఉపయోగపడే పరిస్థితులే ఉత్పన్నమవుతాయి.

సమస్యలపై విధానపరమైన వైఖరి....
పవన్ కల్యాణ్ సుదీర్ఘ సమస్యలపై తన విధానపరమైన వైఖరులు ప్రకటించడం లేదు. అలా ప్రకటిస్తే కొన్ని వర్గాలు దూరమవుతాయనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు. తాను ప్రశ్నించడానికి మాత్రమే ఇప్పటి వరకు పరిమితమయ్యారు. కాపు రిజర్వేషన్లపై గానీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై గానీ ఆయన తన వైఖరిని స్పష్టం చేయలేదు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు కూడా చిరంజీవి తెలంగాణపై, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. ఇది ఎన్నికల్లో ఉపయోగపడేది కాదు.

ఉద్వేగభరితమైన నినాదమేదీ లేదు....
ఎన్నికల బరిలోకి దిగి ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి తగిన ఉద్వేగభరితమైన నినాదమేదీ పవన్ కల్యాణ్ వద్ద లేదు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాత్రమే ఆయన అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఆయనకు కాస్తా ఉపయోగపడవచ్చు. అదే నినాదాన్ని ఎన్నికల సమయంలో జగన్ కూడా వాడుకోవచ్చు.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు....
ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదం ప్రజలను ఉద్వేగానికి గురి చేసింది. ఆ నినాదం తెలుగు ప్రజలను ఉర్రూతలూగించింది. ఆ నినాదం వెనక ఉన్న సామూహిక మానసిక స్థితి పనికి వచ్చింది. ముఖ్యమంత్రులను తరుచుగా మారుస్తుండడం, అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్యను విమానాశ్రయంలో బహిరంగంగా అవమానించడం వంటి కాంగ్రెసు అధిష్టానం చర్యలు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిద్రలేపాయి. దాంతో ఎన్టీ రామారావు తెలుగు ప్రజలను తన వైపు తిప్పుకోగలిగారు. ఆయన వాగ్ధాటి కూడా అందుకు దోహదం చేసింది. దక్షిణాది ఆత్మగౌరవ నినాదం పవన్ కల్యాణ్‌కు ఆ మేరకు ఉపయోగపడే అవకాశాలు లేవు.












Click it and Unblock the Notifications