మోడీ రోడ్ మ్యాప్ ఫెయిల్ ? బలపడుతున్న పవన్-బాబు బంధం ! టీడీపీ టార్గెట్ అందుకేనా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేస్తానన్న పవన్ కళ్యాణ్ తన వ్యూహానికే కట్టుబడుతున్నారు. వైజాగ్ టూర్ లో ప్రధాని మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం టీడీపీకి దూరంగా ఉండిపోయేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో మోడీ రోడ్ మ్యాప్ ఫెయిలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అంతే కాదు దీని పర్యవసానంగా టీడీపీకి సన్నిహితంగా ఉండే వర్గాలు కేంద్ర దర్యాప్తు సంస్ధలకు టార్గెట్ అవుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంలో మరిన్ని ట్విస్టులు తప్పేలా లేవు.

పవన్ కు మోడీ రోడ్ మ్యాప్
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో తన మిత్రపక్షం బీజేపీ రోడ్ మ్యాప్ అడుగుతున్నారు. కానీ ఏపీలో వైసీపీని ఇప్పటికిప్పుడు అకారణంగా దూరం చేసుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. దీంతో వైసీపీపై పోరుకు పవన్ అడిగిన రోడ్ మ్యాప్ పై కాషాయ నేతలు మౌనంగా ఉంటూ వచ్చారు. కానీ పవన్ తెగదెంపులు చేసుకుంటానంటూ చేసిన హెచ్చరికలతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. దీని పర్యవసానంగా ప్రధాని మోడీ వైజాగ్ టూర్ ఫిక్స్ కావడం, వచ్చీ రాగానే మోడీ పవన్ తో భేటీ అయి తొందరపడొద్దని సూచించడం జరిగిపోయాయి. అంతటితో ఆగకుండా టీడీపీకి దూరంగా ఉండమని కూడా చెప్పేయడంతో పవన్ దూకుడు తగ్గించారు. అక్కడితో అంతా సర్దుకుందని భావించేలోగా మరిన్ని ట్విస్టులు మొదలయ్యాయి.

బలపడుతున్న టీడీపీ-జనసేన బంధం ?
ప్రస్తుతానికి ఎవరు అవునన్నా, కాదన్నా టీడీపీ-జనసేన బంధం మాత్రం క్షేత్రస్ధాయిలో కొనసాగుతూనే ఉంది. మిత్రపక్షమైన బీజేపీతో కంటే టీడీపీతో కలిసి పనిచేసేందుకే జనసైనికులు సై అంటున్నారు. అంతేకాదు ఈసారి అధికారంలోనూ పవన్ కు భాగమిస్తానన్న సంకేతాల్ని చంద్రబాబు ఇచ్చేయడంతో ఆ మేరకు ఇరు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. పైకి పొత్తు లేకపోయినా అంతర్గతంగా మాత్రం ఇరు పార్టీల నేతలు కలిసి పనిచేస్తుూనే ఉన్నారు. ఇప్పటికే స్ధానిక ఎన్నికల్లో పలు చోట్ల అధికారం పంచుకున్న టీడీపీ-జనసేన నేతలు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సహకరించుకునేందుకు సిద్దమవుతున్నారు. దీంతో సహజంగానే పవన్ తో పొత్తున్నట్లు చెప్పుకుంటున్న బీజేపీ ఒంటరవుతోంది.

మోడీ రోడ్ మ్యాప్ ఫెయిల్ ?
మోడీ విశాఖ టూర్ లో సూచించిన విధంగా సొంతంగా తన బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్.. మరోవైపు టీడీపీని క్షేత్రస్ధాయిలో కలుపుకుపోతున్నారు. పైకి ఇరుపార్టీల మధ్య పొత్తు కానీ, అవగాహన కానీ
లేకపోయినా అధినేతల పర్యటనల్లో పరస్పర సహకారం కనిపిస్తోంది. బీజేపీతో పోలిస్తే టీడీపీయే నయమన్న భావనలో జనసేన క్యాడర్ కూడా ఉంది. బీజేపీతో కలిస్తే దూరమయ్యే పలు వర్గాల ఓట్లు ఇప్పుడు జనసేన క్యాడర్ ను కూడా భయపెడుతున్నాయి. దీంతో సహజంగానే జనసేన-టీడీపీ పొత్తు ఉంటుందన్న అంచనాతోనే ఇరుపార్టీల కార్యకర్తలు కలిసి పనిచేసుకుంటున్నారు. పవన్-చంద్రబాబు మాత్రమే భేటీ కావట్లేదంతే. దీంతో పవన్ కు మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ఫెయిలయినట్లే కనిపిస్తోంది. మిత్రపక్షమైన బీజేపీ కంటే టీడీపీ క్యాడర్ తోనే కలిసి పనిచేసేందుకు జనసేన చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం.

టీడీపీ టార్గెట్ గా ఈడీ దాడులు ?
టీడీపీ-జనసేన బంధం బలపడుతుందన్న సమాచారంతో బీజేపీ కూడా అప్రమత్తమైంది. కేంద్రం సాయంతో దర్యాప్తు సంస్ధల్ని టీడీపీ సన్నిహితులపైకి ఉసిగొల్పడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిపై దాడులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఎప్పుడో టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ కార్పోరేషన్ స్కాంపైనా ఏపీ ప్రభుత్వం ఫెయిలైనా ఈడీ దర్యాప్తు చేస్తుండటం ఇందులో భాగమేనని తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో మరిన్ని టీడీపీ హయాం స్కాంలు, ఆ పార్టీకి అండగా నిలుస్తున్న వారిని టార్గెట్ చేసే అవకాశముంది. తద్వారా టీడీపీ-జనసేన బంధానికి ఆదిలోనే బ్రేక్ వేసేందుకు బీజేపీ ప్రయత్నించవచ్చని సమాచారం. ఏపీ ఎన్నికల ముందే తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి. వాటిలో అవసరాల ఆధారంగా టీడీపీ టార్గెట్ అవుతుందా లేక బీజేపీకి దగ్గరవుతుందా అనేది తేలిపోనుంది. ఆలోపు జనసేన దూకుడుకు బ్రేక్ వేసేందుకు కూడా ఈ దాడులు పనికొస్తాయని కాషాయ నేతలు నమ్ముతున్నారు.












Click it and Unblock the Notifications