ఫలించిన నిరీక్షణ - ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీం, వీరికే వర్తింపు..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు.. ఉపాధ్యాయులు చాలా కాలంగా పాత పెన్షన్ స్కీం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2004 తరువాత ఉద్యోగంలో చేరిన వారికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అమల్లోకి వచ్చింది. కాగా.. ఏపీ ప్రభుత్వం తాజాగా దాదాపు 11 వేల మంది ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీం అమలు చేసే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేసింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం త్వరలోనే ఉత్తర్వులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి తుది కసరత్తు జరుగుతోంది.
ఏపీలో దాదాపు 11 వేల మంది ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు రంగం సిద్దం అయింది. చాలా కాలంగా ఉద్యోగ సంఘాలు సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి నిరసనలు సైతం నిర్వహించాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం సీపీఎస్ స్థానంలో కొత్త ప్రతిపాదనలు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీపీఎస్ పైన అధ్యయనం చేస్తామని ఎన్నిక ల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. కాగా.. ఇప్పుడు ప్రభుత్వం సుమారు 11 వేల మంది ఉపాధ్యాయులకు సంబంధించి త్వరలో ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. 2002, 2003 నోటిఫికేషన్ల ద్వారా 2004 తర్వాత భర్తీ అయిన టీచర్లకు పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమలుకు చర్యలు ప్రారంభించింది. 2003 డీఎస్సీ టీచర్ల విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకొనే దిశగా అడుగులు వేసింది.

త్వరలోనే ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు..!
ఈ మేరకు సంబంధిత ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపి.. అధికారిక ప్రక్రియను ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రంలో 2004 సెప్టెంబరు 1 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) అమల్లోకి వచ్చింది. అంతకముందు నియామకం అయిన ఉద్యోగులకు మాత్రమే ఓపీఎస్ అమలు చేస్తున్నారు. గత కొంతకాలంగా సీపీఎస్‌ను రద్దు చేయాలనే ఉద్యమం జరుగుతోంది. అయితే 2002, 2003 నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన దాదాపు 11 వేల మంది టీచర్లు వివిధ కారణాలతో 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరారు. దీంతో వారు సీపీఎస్ పరిధిలోకి వచ్చారు. సీపీఎస్ అమలు కంటే ముందే విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా తాము ఉద్యోగాలు పొందినందున, తమకు ఓపీఎస్ అమలు చేయాలని ఆ టీచర్లు కోరుతూ వస్తున్నారు. నోటిఫికేషన్లు ముందే విడుదలయ్యాయనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం వారికి పాత పెన్షన్ స్కీం అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.













Click it and Unblock the Notifications