పెరుగుతున్న కరోనా వైరస్ ప్రభావం .. రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడతాయా ?
దేశ, విదేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రభావం మన దేశంలోనూ నానాటికీ పెరుగుతోంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే ఏపీ సహా పలు రాష్ట్రాల్లో స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. అయితే ఈ నెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలపైనా కరోనా ప్రభావం పడనుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో విద్యాసంస్ధలు, గుళ్లు, మాల్స్ ను మూసివేయాలని ఆదేశాలు ఇస్తున్న ఏపీ సర్కార్... రాజ్యసభ ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంలో మల్లగుల్లాలు పడుతోంది.

రాజ్యసభ ఎన్నికలపై కరోనా ఎఫెక్ట్..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేసింది. ఎన్నికల కమిషనర్ ఇప్పటికే స్ధానిక ఎన్నికలను వాయిదా వేసేయగా... విద్యాసంస్ధలు, గుళ్లు, మాల్స్ ను మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడే పరిస్ధితి ఇలా ఉంటే మరో ఆరు రోజుల్లో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికల నిర్వహణ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. కరోనా ప్రభావంతో ఇప్పటికే వెలగపూడిలోని ఏపీ సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణాల్లో సందర్శకుల రాక తగ్గిపోయింది. మంత్రులు కూడా అవసరమైతే తప్ప సచివాలయానికి రావడం మానేశారు. అధికారులు, మంత్రులు రాకపోయే సరికి సాధారణ సందర్శకులు కూడా రాకపోకలు తగ్గించేశారు.

రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓటు...
రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిందే. వీరంతా ఇప్పటికే కరోనా ప్రభావంతో నియోజకవర్గాలను, ఇళ్లను వదిలి బయటకు రావడం మానేశారు. చాలా కాలం తర్వా్త సీఎం జగన్ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి మాత్రమే సచివాలయానికి హాజరయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికే ఆయన పరిమితమవుతున్నారు.. అటు విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉండవల్లిలోని నివాసం లేదా హైదరాబాద్ లోని ఇంట్లోనే ఉంటున్నారు.. కానీ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరిగితే వీరంతా అసెంబ్లీకి రాక తప్పదు.

అసెంబ్లీకి ఎమ్మల్యేలు వస్తే...
రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు తరలి రావాలంటే వారితో పాటు అనుచరులు కూడా తప్పనిసరి. అధికారులు వీరికి అదనం. ఎన్నికలు జరుగుతున్నంత సేపు సచివాలయం, సిబ్బంది కూడా అక్కడే ఉండాల్సి ఉంటుంది. దీంతో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఉండే వాతావరణం ఆ ఒక్క రోజు కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో ఎక్కడ ఏ తేడా జరిగినా ప్రజాప్రతినిధుల ఆరోగ్యానికి ముప్పు తప్పదు. దీంతో ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆలోచనలో పడింది.
Recommended Video

సీఈసీకి ఎప్పటికప్పుడు సమాచారం..
ఏపీలో కరోనా ప్రభావం నేపథ్యంలో తాజా పరిస్ధితిని అధికారులు ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతానికి పరిస్ధితి నియంత్రణలోనే ఉన్నా.. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు, దీంతో పరిస్ధితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సీఈసీకి సమాచారం ఇస్తున్నారు. పరిస్ధితి చేయిదాటితే మాత్రం ఎన్నికల నిర్వహణ అసాధ్యంగా మారుతుంది. కాబట్టి అప్పుడు సీఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications