'ఆదినారాయణ' చిచ్చు:అంతవరకేనని బాబుకి రామసుబ్బారెడ్డి హెచ్చరిక
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు పార్టీకి చెందిన సీనియర్ నేత రామసుబ్బా రెడ్డి గురువారం నాడు షాకిచ్చారు! తనకు గౌరవం ఉన్నంత వరకే టిడిపిలో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం రామసుబ్బా రెడ్డి అధినేతను విజయవాడలో కలిశారు. ఆ సమయంలోనే ఆదినారాయణ రెడ్డిని చేర్చుకుంటున్నట్లుగా చంద్రబాబు తేల్చి చెప్పారు.

ఆదినారాయణ రెడ్డి చేరికను రామసుబ్బా రెడ్డి జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అతని రాకను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. కడప జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఆదిని చేర్చుకుంటున్నట్లు చంద్రబాబు నచ్చ చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన అనుచరులు, కార్యకర్తలతో రామసుబ్బా రెడ్డి గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదినారాయణ రెడ్డి చేరికపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధిపైనే తాను ఆలోచిస్తున్నానని చెప్పారు. గౌరవం ఇచ్చినంత వరకూ పార్టీలోనే ఉంటానని, ఆపై కార్యకర్తల మాటే తన మాట అన్నారు. తన నియోజకవర్గంలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు లభించడం అదృష్టమన్నారు.


Click it and Unblock the Notifications