రూటు మార్చేస్తున్న జగన్ ! ఢిల్లీ సక్సెస్ తో మారుతున్న లెక్కలు..?
ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు విపక్ష వైసీపీ అధినేత జగన్ ను అనివార్యంగా ఇండీ కూటమి వైపు నెట్టేస్తున్నాయి. ఐదేళ్లుగా మోడీతో జట్టు కట్టినా ఏపీలో మాత్రం పరిస్ధితులు తారుమారు కాగానే బీజేపీ తనకు దూరంగా జరిగిపోవడం, తన ప్రత్యర్థి చంద్రబాబు చెప్పినట్లు ఆడుతుండటంతో వచ్చే ఐదేళ్లలో ఏం జరగబోతోందో జగన్ ముందుగానే అంచనా వేసుకుంటున్నారు. దీంతో తన వ్యూహాలు మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు.
ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న రాజకీయ హింసపై ఢిల్లీ వేదికగా జగన్ పోరు మొదలుపెట్టగానే అంతా నవ్వుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ చేయాల్సిన పోరాటం ఢిల్లీలో చేయడం ఏంటని ప్రశ్నించారు. కానీ ఢిల్లీలో వైసీపీ ధర్నా మొదలయ్యాక చోటు చేసుకున్న పరిణామాలు సహజంగానే ఇలాంటి వాదనలు చేసే వారిని ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. రాష్ట్రంలో ఎన్డీయే కూటమిపై పోరాడుతున్న నేతగా జగన్ ను ఇండీ కూటమి అనూహ్యంగా అక్కున చేర్చుకుంది. కాంగ్రెస్ మినహా కూటమిలో పార్టీలు తరలివచ్చి జగన్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.

ఢిల్లీ ధర్నాలో అనూహ్యంగా లభించిన ఇండీ కూటమి మద్దతు ఇప్పుడు జగన్ ఆలోచనల్ని మార్చేసేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్రాల్లో తప్పనిసరిగా ఎన్డీయేపై పోరాడాల్సిన పరిస్ధితిని జగన్ కు కల్పిస్తోంది. దీంతో రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, ఇతర సాయంపై కేంద్ర, రాష్ట్రాల్ని నిలదీసే పనిని జగన్ చాలా ముందుగానే ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలంటూ వైసీపీ చేసిన డిమాండ్ చూస్తుంటే పార్లమెంట్ లోనూ ఎన్డీయే కూటమితో అమీతుమీకి జగన్ సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది.
గతంలో తన తండ్రి మరణం తర్వాత సీఎం పదవిని వారసత్వంగా తనకు ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి సోనియా గాంధీపై పోరాటం చేసి జైలుకెళ్లిన జగన్.. జనంలో మాత్రం కావాల్సినంత సానుభూతి తెచ్చుకున్నారు. ఇప్పుడు అవసరమైతే ప్రధాని మోడీపైనా అదే తరహా పోరాటం చేసి అవసరమైతే జైలుకెళ్లి అయినా వచ్చే ఎన్నికలకు రాష్ట్రంలో సానుభూతి తెచ్చుకోవాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఇదంతా వెంటవెంటనే కాకపోయినా క్రమంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications