జగన్ ముందస్తు ఆలోచన విరమించుకున్నట్లేనా ? టీడీపీ తాజా విశ్లేషణ ఇదే..!
ఏపీలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దమవుతోందన్న ప్రచారం నిన్న మొన్నటి వరకూ జోరుగా సాగింది. ఓవైపు వైసీపీ పెద్దలుగా భావించే సజ్జల, మంత్రి పెద్దిరెడ్డి వంటి వారు లేదు లేదంటున్నా ఈ ప్రచారానికి మాత్రం బ్రేక్ పడలేదు. అంతేకాదు ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ రద్దుకు, ముందస్తు ఎన్నికలపై జగన్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం విపక్షాలు జోరుగా చేసాయి. చివరికి రెండు రోజుల క్రితం మంత్రి పెద్దిరెడ్డి మరోసారి ముందస్తుకు వెళ్లడం లేదని స్పష్టత ఇచ్చేయడంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
అయితే ముందస్తు ఎన్నికల విషయంలో జగన్ నిజంగానే వెనక్కి తగ్గారా ? అందుకే ఈ ప్రచారం ఎంత వేగంగా తెరపైకి వచ్చిందో అంతే వేగంగా తెరమరుగవుతోందా ? దీనిపై విపక్షాలకు కూడా క్లారిటీ వచ్చేస్తోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. నిన్న మొన్నటి వరకూ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాడు, మీరు రెడీగా ఉండండి అంటూ టీడీపీ శ్రేణులకు పదే పదే చెప్పిన చంద్రబాబు, లోకేష్ తాజాగా మౌనం వహించడం వెనుక కూడా కారణం ఇదేనా అనే ప్రచారం మొదలైంది. దీనిపై టీడీపీ నేతలే బహిరంగంగా విశ్లేషణలు చేస్తున్నారు.

గతంలో ముందస్తు ఎన్నికలపై పలుసంకేతాలు ఇచ్చిన వైఎస్ జగన్ తాజాగా ఈ అంశంపై వెనక్కి తగ్గారని టీడీపీ నేత వర్ల రామయ్య చెబుతున్నారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన... ముందస్తు ఎన్నికలకు వైసీపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లమని మంత్రి పెద్దిరెడ్డి చెప్పడం భయపడి తోకముడిచినట్లు కాదా? అని నిలదీశారు.అలాగే జగన్ ముందస్తు ఆలోచన విరమించుకున్నారని చెప్పేందుకు మరికొన్ని ఉదాహరణల్ని కూడా ఆయన ప్రస్తావించారు.
గతంలో వైఎస్ జగన్ వై నాట్ 175 అని ప్రగల్భా లు పలికారని, అవి ఇప్పుడు ఏమయ్యాయని వర్ల ప్రశ్నించారు. అలాగే కుప్పం కొడతామన్న డాంబికాలు ఏమయ్యాయని కూడా ప్రశ్నిస్తున్నారు. జగన్ ఇప్పుడు ఎందుకు బీద పలుకులు పలుకుతున్నాడని ఆయన అడిగారు. వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం లేదని గ్రహించే, ఒక్కరోజు అధికారాన్ని కూడా వదులుకోమని పెద్దిరెడ్డి అంటున్నారని వర్ల విశ్లేషించారు. ఈ కారణాలతోనే జగన్ ముందస్తు ఆలోచన విరమించుకున్నట్లు వర్ల చెబుతున్నారు.












Click it and Unblock the Notifications