పవన్ ఓడిన సీటులో వైసీపీ తిరిగి గెలుస్తుందా? తాజా లెక్కలేంటి?
ఏపీలో రాజకీయంగా చైతన్యం కలిగిన విశాఖపట్నం లోక్ సభ స్ధానం పరిధిలో ఉన్న గాజువాక అసెంబ్లీ సీటు 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడ జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడం, ఓటమి పాలవ్వడం ఈ నియోజకవర్గం పేరును రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మార్చాయి.
గాజువాక అసెంబ్లీ సీటు జనరల్ నియోజకవర్గం. ఇక్కడ 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా కాపు, బీసీ సామాజిక వర్గాల హవా ఇక్కడ ఉంటుంది. గాజువాక ,పెద గంట్యాడ మండలాలు ఈ అసెంబ్లీ సీటు పరిధిలో ఉన్నాయి. 2009లో నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన చింతలపూడి వెంకట్రామయ్య గెలుపొందారు.

ఆ తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఇక్కడ నుంచి గెలిచింది. ఇలా నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో మూడు పార్టీలు ఇక్కడి నుంచి గెలిచాయి. అయితే టీడీపీ, జనసేన, వైసీపీ విడివిడిగా పోటీ చేయడంతో భారీగా ఓట్లు చీలిపోయి వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డికి 84,645 ఓట్లు రాగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు 70,125 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్ధి పల్లా శ్రీనివాసరావుకు 56,642 ఓట్లు వచ్చాయి .

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పరిస్ధితులు చాలా మారాయి. ముఖ్యంగా పవన్ పై గెలిచిన తిప్పల నాగిరెడ్డికి ఈసారి వైసీపీ సీటు ఇవ్వలేదు. వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో ఇక్కడ వరికూటి రామచంద్రరావుకు సీటు కేటాయించారు. అయితే టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.. ఈసారి టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా రంగంలోకి దిగుతున్నారు. దీంతో ఆయన గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయి. కాబట్టి ఈసారి గాజువాక గెలవాలంటే వైసీపీ తీవ్రంగా శ్రమించాల్సిందే.












Click it and Unblock the Notifications