చలి 'పులి' వచ్చేసింది: వణుకుతున్న విశాఖ మన్యం, లంబసింగిలో అత్యల్పం
అమరావతి: విశాఖ మన్యంలో చలిపులి చంపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతంగా తగ్గిపోయాయి. దీంతో చలికి ప్రజలు వణికిపోతున్నారు. వాస్తవానికి నవంబర్ మూడో వారం నుంచే చలి మొదలు కావాల్సి ఉంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాలు, ద్రోణుల ప్రభావంతో ఈ ఏడాది చలి కాస్తంత ఆలస్యమైంది.
అల్పపీడనాలు, ద్రోణుల వల్ల ఆకాశంలో మేఘాలు ఏర్పడతాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల చలి తీవ్రత కనపించదు. కానీ గత కొన్ని రోజులుగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనద్రోణి బలహీన పడటంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతంగా తగ్గిపోయాయి.
మరోవైపు అధిక పీడనం ప్రభావంతో విదర్భ, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తాల వైపు చల్లటి వాయవ్య గాలులు వీస్తున్నాయి. దీంతో సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇప్పుడు 1 నుంచి 2 డిగ్రీలుగా నమోదవుతుంది. కాశ్మీరా వ్యాలీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా పిలువబడే లంబసింగిలో గురువారం 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

విశాఖకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లంబసింగిలో నాలుగేళ్ల క్రితం జీరో డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైంది. తూర్పు కనుమల్లో ఉన్న ఈ లంబసింగి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. డిసెంబర్ వచ్చిదంటే చాలు ఒక్కసారిగా లంబసింగికి పర్యాటకులు అమాంతం పెరుగుతారు.
బుధవారంతో పోల్చుకుంటే ఒక్కరోజులోనే రెండు డిగ్రీలు పడిపోయింది. మరోవైపు అమ్మవారి పాదాలులో 7 డిగ్రీలు, పాడేరు, చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు గడచిన 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.












Click it and Unblock the Notifications