అమరావతి శంకుస్థాపన టెండర్ ముంబై సంస్థకు, షరతులు ఎన్నో...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన, భూమిపూజ నిర్వహణ బాధ్యతను ముంబైకి చెందిన విజ్ క్రాఫ్ట్ సంస్థ రూ.9.5 కోట్లకు కైవసం చేసుకుంది. ఈ మేరకు సిఆర్డీఏ నిర్వహించిన టెండర్ ప్రక్రియలో ఆ సంస్థ ఈ బాధ్యతలు దక్కించుకుంది.
అక్టోబర్ 22వ తేదీన రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం భారీగా నిర్వహించనుంది. ప్రధాని నరేంద్ర మోడీ, సింగపూర్ ప్రధాని తదితరులు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈవెంట్ మేనేజింగ్ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించాలని ఈ నెల 16వ తేదీన సిఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది.
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) నిర్వహించిన టెండరు ప్రక్రియలో ఆ సంస్థ తొమ్మిదిన్నర కోట్ల రూపాయలకు ఈ బాధ్యతలు పొందింది. కార్యక్రమాల నిర్వహణ సంస్థలకు (ఈవెంట్ మేనేజింగ్ ఏజెన్సీ) ఈ బాధ్యతలు అప్పగించడానికి సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది.

22వ తేదీలోగా దాఖలు చేయాలని సూచించింది. 26న టెండరు ఖరారు చేసింది. టెండరు నిబంధనలు, సమయం తదితరాల విషయంలో సీఆర్డీఏ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని, దీంతో కేవలం రెండు సంస్థలే టెండరు దాఖలు చేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విజ్ క్రాఫ్ట్‌కు ఏపీ షరతులు
విజ్ క్రాఫ్ట్‌కు టెండర్లో పలు షరతుల విధించారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం సమీపంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణం చదును చేసి, కార్పెట్ పరచడం, వెయ్యి మంది ప్రముఖులు, అత్యంత ప్రముఖులు, 50 వేల మంది ప్రజలు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలి.
వంద మంది వరకు కూర్చునే విధంగా సభా వేదిక ఉండాలి. గన్నవరం విమానాశ్రయం నుంచి ముఖ్యులను ఆహ్వానించారు. వారికి వసతి, సభాస్థలి వరకు తీసుకొని రావడం, వారు తిరుగు పయనమయ్యే వరకు బాధ్యత ఈవెంట్ మేనేజ్‌మెంట్‌దే..
ప్రముఖుల రవాణా, వసతికి ప్రభుత్వం నిధులు ఇవ్వనుంది. ప్రవేశ ద్వారాలు, బారికేడ్లు, సౌండ్ సిస్టమ్, లైటింగ్, జనరేటర్లు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, ముఖ్య అతిథులకు అల్పాహారం, సాంస్కృతిక కార్యక్రమాలు, యాంకరింగ్ తదితర బాధ్యతలు కూడా విజ్ క్రాఫ్ట్ సంస్థనే చూసుకోవాలి.
కార్యక్రమానంతరం వీడియో, ఫొటోగ్రఫీతో పాటు 2, 3 లఘు చిత్రాలు సిద్ధం ఇవ్వాలి. అంతేకాదు, టెండర్లో పాల్గొనే సంస్థ ఏడాదికి రూ.10 కోట్లు టర్నోవర్ చేసి ఉండాలి.
గత మూడేళ్లలో పదివేల మందికి పైగా పాల్గొన్న కార్యక్రమాలు పది చేసి ఉండటంతో పాటు, అందులో ఒక్కటైనా ప్రభుత్వ కార్యక్రమం ఉండాలి. ఇతర దేశాల అతిథులు పాల్గొన్న కార్యక్రమం అయితే ప్రాధాన్యం. సంస్థ ప్రతినిధి సీఆర్డీఏ కార్యాలయంలో అందుబాటులో ఉండాలి.












Click it and Unblock the Notifications