మోసంతో పెళ్లి: ఐఏఎస్ అధికారిపై మహిళ (ఫోటో)
తనను మోసగించిన కేసులో ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాసాగర్ ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి రత్నప్రభలను వెంటనే అరెస్టు చేయాలని వత్సల డిమాండ్ చేశారు. ఈ దంపతుల తీరుపై ఇటీవల ఆమె కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులు ఈ ఇద్దరు అధికారులతో పాటు మాజీ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు, ఆనంద రావు, కృపాకర్, సుభద్ర, శ్యామల తదితరుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం వత్సలను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం పిలిపించారు.

పోలీసులను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యాసాగర్, రత్నప్రభలను అరెస్టు చేయకుండా తప్పించుకోవడానికి పోలీసులు సహకరిస్తే వారి పైన కేసులు పెడతానని హెచ్చరించారు. తనకు విద్యాసాగర్ నుండి ప్రాణహానీ ఉందన్నారు.
భయంభయంగా బతుకుతున్నానని, రోజుకోచోట తలదాచుకుంటున్నానని చెప్పారు. రత్నప్రభకు విడాకులు ఇచ్చానని నమ్మించిన విద్యాసాగర్ తనను పెళ్లి చేసుకున్నాడని, 2007 నుండి 2011 వరకు తాము కలిసే ఉన్నామని చెప్పారు. తాము భార్యాభర్తలమనే ఆధారాలను తాను లేని సమయంలో అతను కాల్చేశాడన్నారు. నేను కూడా ఆయన భార్యనేనని రుజువు చేసే ఆధారాలు పోలీసులకు ఇచ్చానని చెప్పారు.












Click it and Unblock the Notifications