మద్యానికి బానిసై వేధిస్తున్న భర్తను చంపిన భార్య
విజయవాడ: భర్త నిత్యం పీకలదాకా మద్యం తాగి వచ్చి తనను వేధిస్తుండటంతో విసిగిపోయిన ఓ భార్య అతన్ని హతమార్చిన సంఘటన చిత్తూరు జిల్లాలో శనివారం జరిగింది. నిమ్మనపల్లి మండలం మాచిరెడ్డిగారిపల్లెకు చెందిన ఓ భర్తను భార్య హత్య చేసింది.
నిత్యం తాగి వచ్చి తనను వేధిస్తున్నందుకే భర్తను హత్య చేశానని సదరు భార్య పోలీసులకు చెప్పింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
ఆరుగురు దొంగల అరెస్టు
అనంతపురం జిల్లాలోని ధర్మవరణం పట్టణంలో వివిధ చోరీ కేసులకు పాల్పడిన ఆరుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 20 లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా గుంటూరు జిల్లావాసులని ధర్మవరం పోలీసులు చెప్పారు. ఈ దొంగలు ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడ్డారనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

గంజాయి స్వాధీనం
విశాఖపట్నం జిల్లాలోని గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో కోటిరూపాయల విలువైన 800 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దేవరాపల్లి వద్ద ఆటోలో 250 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న మరో ఆటో పోలీసులను ఢీకొట్టి వెళ్లింది. ఈ సంఘటనలో కానిస్టేబుల్, హోంగార్డుకు గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలం వెంకటాపురంలో వేగంగా వస్తున్న ఓ లారీ తూఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించగా, మరో 18 మంది గాయపడ్డారు. ముగ్గురు మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలం వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేపిస్తున్నారు.












Click it and Unblock the Notifications