రేప్ చేసి సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు.. మద్యం తాగి మహిళను దూషించిన ఏఎస్ఐ
హైదరాబాద్: నగరంలో రోజురోజుకీ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొమ్మర పొచంపల్లి సాయిపూజ కాలనీలో ఓ గృహిణి అత్యాచారానికి గురైంది. తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చి బలవంతంగా ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు.
ఆ తర్వాత ఆమె నగ్న దృశ్యాలను సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హఫీజ్ ఖాన్, అబ్బూ ఫైజల్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను అక్కడి ఏఎస్‌ఐ తాగి కొట్టిన ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే... కిలారు లక్ష్మీ కుమారి, నారాయణ దంపతులు బావినేని బజారులో నివాసం ఉంటున్నారు.

వీరికి పక్కింట్లో ఉన్న తబిత అనే మహిళతో గొడవ జరిగింది. తమను తబిత అకారణంగా తిడుతున్నట్లు లక్ష్మీకుమారి 100 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు వచ్చి తబితను వారించినా ఫలితం లేకపోవడంతో... దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయమన్నారు.
దీంతో లక్ష్మీకుమారి తన కోడలితో కలిసి పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దీంతో అక్కడ విధులను నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ ఫిర్యాదు తీసుకుపోగా స్టేషన్‌కు వచ్చిన తమను అసభ్యంగా మాట్లాడి చేయి చేసుకున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం తాగి విధులను నిర్వహిస్తున్న ఆ ఏఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications