ఒకరి జుట్టు మరొకరు పట్టి కొట్టుకున్న మహిళలు
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఓ మహిళను మరికొందరు మహిళలు కలిసి చితగ్గొట్టారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం బుధవారం రణరంగాన్ని తలపించింది. వందల మంది డ్వాక్రా మహిళలు నిధుల విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. జుట్లు పట్టుకుని, పిడిగుద్దులు కురిపిస్తూ హంగామా చేశారు.
డ్వాక్రా సంఘాలకు చెందిన కొంత మొత్తాన్ని కొంతమంది స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో 80 వేలను తిరిగి కట్టేశారు. మరో లక్ష రూపాయలు ఇంకా అలాగే ఉంది. డబ్బులు పక్కదోవ పడుతున్నాయంటూ కొంతమంది కలిసి ఓ గ్రూపు నాయకురాలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

అంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు. దాంతో 28 డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇందులో ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
అది ఘర్షణకు దారి తీసి కొట్టుకునే స్థాయికి వెళ్లింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు డ్వాక్రా మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
అచ్చంపేటలో దారుణం
గుంటూరు జిల్లా అచ్చంపేటలో రౌడీమూకలు బీభత్సం సృష్టించారు. బాకి చెల్లించనందున ఇల్లు రాసివ్వాలని బాధితుడిని చితకబాదారు. అతని పైన కత్తులతో దాడికి యత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకొందరు పరారయ్యారు.












Click it and Unblock the Notifications