మంత్రి బుగ్గనకు షాక్ : పథకాలు.. ధరలపై మహిళ లెక్కల పాఠం: జగన్ కే ఓట్లు..!!
రాష్ట్రానికి లెక్కల పద్దులు సిద్దం చేసి..ఆర్దిక నిర్వహణ చేసే మంత్రి బుగ్గనకు ఓ సాధారణ మహిళ ఆర్దిక పాఠాలు చెప్పారు. ఆ మహిళ చెప్పిన ప్రభుత్వ పథకాల లెక్కలు.. పెరిగిన ధరలతో నష్టాల చిట్టాతో మంత్రి బుగ్గన షాక్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి బుగ్గన తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. స్థానిక 31వ వార్డులో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సాధారణంగా సమీక్షలు..అసెంబ్లీలో పథకాలు..ఆర్దిక వ్యవహారాలను వివరించే మంత్రి బుగ్గన..ఇప్పుడు సాధారణ ప్రజల ప్రశ్నలకు సైతం మొత్తం లెక్కలు చెప్పాల్సి వచ్చింది.

లక్ష ఇచ్చి..రెండు లక్షలు తీసుకున్నారు
బుగ్గన పర్యటన సమయంలో ఒక సాధారణ మహిళ..పథకాలు ఇస్తున్నారు. అటు ధరలు పెంచారు. మీరేమి ఇచ్చారు అంటూ పథకాల లెక్కలు.. పెంచిన ధరల వివరాలను మంత్రి ముందు ఏకరువు పెట్టారు. ధరలు పెంచి.. తమ డబ్బు తీసుకుని తమకే ఇస్తున్నారంటూ నిలదీసారు. మీరేమైనా ఉచితంగా ఇస్తున్నారా అంటూ మంత్రి బుగ్గనను ప్రశ్నించారు.
తమకు టైలర్ల సాయం కింద డబ్బు వస్తుందంటే దరఖాస్తు చేయగా మంజూరైందని చెబుతూ..డబ్బు పడకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. తమ పిల్లలకు ఉద్యోగాలు దక్కుతాయనే నమ్మకంతో జగన్ కు తమ ఇంట్లో మూడు వేశామంటూ చెప్పుకొచ్చారు.

లేని భూమి ఉందన్నారు..అదే ఇప్పించండి
ఆ మహిళ ఆవేదన పూర్తిగా విన్న తరువాత మంత్రి స్పందించారు. ఆ మహిళ కుటుంబానికి రూ.98,140 పడ్డాయని చెప్పిన మంత్రి... ఇంకా రాలేదని ఎలా చెబుతారని పేర్కొన్నారు. అయితే, దీనికి ఆ మహిళ సమాధానం ఇస్తూ.. లక్ష రూపాయాలు ఇచ్చి.. అధిక ధరల పేరుతో రెండు లక్షలు లాగేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
అదే సమయంలో ఆ మహిళ తనకు టైలర్ల సాయం కింద చెప్పటంలో వాస్తవం లేదని.. ఆ మహిళ బ్యాంకు ఖాతాలో నగదు జమ అయిందని వాలంటీరు వివరించారు. అదే విధంగా మరో మహిళ సైతం తన ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నా..ఒకరికి కూడా అమ్మఒడి కింద డబ్బులు పడలేదని మంత్రికి వివరించారు.

మంత్రుల సహనానికి పరీక్షగా
సచివాలయంలో విచారిస్తే తమ పేరుతో 10 ఎకరాల భూమి ఉన్నట్లుగా చెబుతున్నారని మంత్రికి ఫిర్యాదు చేసారు. తమకు అసలు భూమే లేదన్నారు. తమకు ఈ కారణంగా ఏ పథకమూ అందటం లేదని..తమ పేరుతో చూపిస్తున్న భూమి అయినా తమకు ఇప్పించాలని మంత్రి ని కోరారు. ఇలా... వైసీపీ మంత్రులు - ఎమ్మెల్యేల గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల మధ్యకు వెళ్తున్న వేళ.. ఎదురవుతున్న ప్రశ్నలు.. నిలదీతలకు సమాధానం చెప్పటం వారి సహనానికి పరీక్షగా మారుతోంది.












Click it and Unblock the Notifications