మహిళా బిల్లు ఎఫెక్ట్ - ఏపీలో మహిళలకు కేటాయించే స్థానాలు ఇవే..!!
ఎన్నికల వేళ మహిళా బిల్లు ఆశావాహుల్లో టెన్షన్ పెంచుతోంది. ఏపీలో ఇప్పటికే ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ, టీడీపీ, జనసేనకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇప్పటికే అభ్యర్దుల ఎంపికపైనా కసరత్తు మొదలైంది. ఈ సమయంలోనే మహిళా బిల్లు తెర మీదకు వచ్చింది. ఈ ఎన్నికల్లో అమలు అయ్యేనా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఈ బిల్లు కారణంగా మహిళలకు కేటాయించే స్థానాలపైన మాత్రం స్పష్టత వచ్చింది.
మహిళా రిజర్వేషన్ల ప్రకారం:మహిళా బిల్లును కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం తరువాత 50 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంది. దీని ద్వారా ప్రతీ రాష్ట్రంలో మొత్తం స్థానాల్లో లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏపీలో 8 లోక్ సభ, 58 అసెంబ్లీ స్థానాలకు మహిళలకు కేటాయించాలి. అయితే, 2021 జనాభా లెక్కలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. కానీ, ఎన్నికల సంఘం..ప్రభుత్వాల వద్ద ఉన్న సమాచారం మేరకు ఏపీలో ఏ లోక్ సభ.. అసెంబ్లీ స్థానాల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉందీ.. ఏ స్థానాలు వారికి కేటాయించే అవకాశం ఉందనే దాని పైన పార్టీలు ఒక అంచనాకు వచ్చాయి.

లోక్ సభ స్థానాలు ఇవేనా:అందులో భాగంగా..ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాల్లో అత్యధికంగా మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్న స్థానాల్లో తొలి ఎనిమిదిని గుర్తించారు. అందులో వరుసగా విశాఖపట్నం (9.20 లక్షల మహిళలు), గుంటూరు(8.82 లక్షలు), నర్సరావు పేట (8.58), నెల్లూరు(8.55), తిరుపతి ((8.50-ఎస్సీ), అనంతపురం(8.48), నంద్యాల(8.38), విజయవాడ (8.30 లక్షల మంది) లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అదే విధంగా 58 అసెంబ్లీ స్థానాల్లో మహిళల సంఖ్య ఆధారంగా రిజర్వ్ అయ్యేవిగా అంచనా వేస్తున్న జాబితాను గుర్తించారు. అందులో.. భీమిలి, పాణ్యం, గాజువాక, చంద్రగిరి, తిరుపతి, మంగళగిరి, పెనమలూరు, రంపచోడవరం, పెందుర్తి, గురజాల, విశాఖ నార్త్, కోవూరు, కర్నూలు, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, గుంటూరు పశ్చిమ, గన్నవరం, మైలవరం, నెల్లూరు రూరల్, తెనాలి, నంద్యాల, అనంతపురం అర్బన్, ఇచ్చాపురం, కడప, శ్రీకాకుళం, చింతలపూడి ఉన్నాయి.

అసెంబ్లీ స్థానాల లెక్క:వీటితో పాటుగా రాజమండ్రి అర్బన్, ప్రత్తిపాడు, రాజమండ్రి రూరల్, గుంతకల్లు, కాకినాడ సిటీ, పలమనేరు, విశాఖ తూర్పు, మాచర్ల, వినుకొండ, కాకినాడ రూరల్, భీమవరం, రాయదుర్గం, మదనపల్లె, పోలవరం, కావాలి, జమ్మలమడుగు, కొత్తపేట, పాకరావుపేట, శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు, ఆదోని, విజయనగరం, రాయచోటి, కదిరి, రాప్తాడు, ఆలూరు, గుంటూరు తూర్పు, విజయవాడ పశ్చిమ, ఒంగోలు, బనగానపల్లె, తాడిపత్రి ఉన్నాయి. అయితే, ఈ ఎన్నికలకు సాంకేతికగా అమలు సాధ్యం కాదనే అభిప్రాయం ఉన్నా.. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం సమయంలో..తరువాత రాజకీయంగా తీసుకొనే నిర్ణయాలు కీలకం కానున్నాయి. దీంతో, ఆశావాహులు ప్రత్యమ్నాయంగా తమ మహిళా వారసులపైన ఫోకస్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications