అప్పు తీర్చలేదని కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి..! చంద్రబాబు ఫైర్.. షర్మిల విమర్శలు..!
ఏపీలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదని ఓ మహిళను ఆమె కొడుకు ముందే చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన ఏకంగా సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనే చోటు చేసుకుంది. దీంతో ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఘటనపై విపక్ష కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు. మహిళగా తాను ఈ ఘటనకు సిగ్గు పడుతున్నట్లు పేర్కొన్నారు.
అప్పు తీర్చలేదని కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేయడం అమానుషమని షర్మిల విమర్శించారు. సభ్య సమాజం తల దించుకొనే దుశ్చర్య ఇది అన్నారు. కన్న కొడుకు ముందే తల్లికి జరిగిన ఘోర అవమానం అన్నారు. సాటి మహిళగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలుగింటి ఆడపడుచుకి సీఎం ఇలాకాలోనే రక్షణ లేదు అనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే ధైర్యం కుప్పంలో చంద్రబాబు ఇచ్చారా అని ప్రశ్నించారు. లేక మహిళా హోంమంత్రి గారు ఇచ్చారా అని అడిగారు.

మహిళల మీద ఇలాంటి దాడులు జరగడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఆడపడుచుల పక్షపాతి అని, తెలుగింటి ఆడపడుచుల పార్టీ తెలుగుదేశం పార్టీ అని గొప్పలు చెప్పుకోవడం పక్కన పెట్టీ, ఇలాంటి అమానవీయ ఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఆ మహిళకు జరిగిన అవమానానికి బాధ్యత వహించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

కుప్పంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సిఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మహిళపై దాడి జరిగిందని, మహిళను చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన మునికన్నప్ప, అతని కుటుంబ సభ్యులపై చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో సిఎం మాట్లాడారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని సీఎంకు జిల్లా ఎస్పీ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు.












Click it and Unblock the Notifications