వైసీపీ, జనసేనలకు యనమల ఫోన్: శ్రీకృష్ణ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బాబు
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోదావరి పుష్కరాలకు అన్ని పార్టీలకు ఆహ్వానం అందింది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్ని పార్టీలకు ఫోన్ చేసి పుష్కరాలకు ఆహ్వానించారు.
గోదావరి పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా పుష్కరాలకు రావాలని ఏపీలోని అన్ని పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పుష్కరాలు జరుగుతున్నాయి.

యనమల స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానం పలుకుతుండటం గమనార్హం. మంగళవారం ఉదయం గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. యనమల.. ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బిజెపి, జనసేన పార్టీలకు ఫోన్ చేసి ఆహ్వానించారు.
గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1500 కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం రూ.600 కోట్లు ఖర్చు చేస్తోంది. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.
పండుగగా జరుపుకుందాం: చంద్రబాబు
పుష్కరాలను పవిత్రమైన పండుగగా జరుపుకుందామని చెప్పారు. రేపు ఉదయం 6.26 గంటలకు పుష్కరాలు ప్రారంభమవుతాయని చెప్పారు. గోదావరి పుష్కరాల వల్ల పుణ్యం, పురుషార్థం లభిస్తాయని చెప్పారు. గోదావరి నదితో తెలుగు జాతికి అవినాభావ సంబంధముందని చెప్పారు.
పుష్కరాల సందర్భంగా ప్రతి ఒక్కరు గోదావరి నదితో అనుసంధానం కావాలన్నారు. రాజమండ్రి నగరం, గోదావరి పరివాహక ప్రాంతాలని అభివృద్ధి చేస్తామని చెప్పారు. పుష్కరాల సందర్భంగా ప్రతి ఒక్కరు సేవాభావంతో పని చేయాలన్నారు.
గోదావరి పుష్కరాలు ఓ మతానికి సంబంధించినది కాదన్నారు. ప్రత్యేక బస్సుల్లో సర్ ఛార్జీలు తీసేశామని చెప్పారు. 270 పుష్కర ఘాట్లు, 10 పుష్కర నగరాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. డ్వాక్రా మహిళలు స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. పుష్కరాల పైన ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటానని చెప్పారు.
'శ్రీకృష్ణ' ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి గోదావరి నిత్యహారతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications