ఏదో అద్భుతం జరిగితే తప్ప అక్కడ టీడీపీ గెలవడం కష్టమే..!
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘెర ఓటమిని మూటగట్టుకుంది. కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించగలిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసలైన గేమ్ ఛేంజర్‌గా నిలిచారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించారు. దారుణ ఓటమితో వైసీపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా.
కానీ అనూహ్యంగా వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస విజయాలను నమోదు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత జరిగిన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సైతం వైసీపీ నాయకులు సత్తా చాటారు. స్టాండింగ్ కమిటీలో ఉన్న ఐదు స్థానాలకు గానూ ఐదింటినీ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం మంత్రి టీజీ భరత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు సమరం విశాఖకు మారింది.

స్థానిక సంస్థల కోటా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక త్వరలోనే జరగనుంది.ఈ క్రమంలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు బొత్సకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి పీలా గోవింద్‌తో పాటు పెందుర్తి నేత గండి బాబ్జీ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు గెలుపుపై వైసీపీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు. స్థానిక సంస్థల్లో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది.
వైసీపీదే ఆధిక్యత ఎమ్మెల్సీ ఎన్నికలో జీవీఎంసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం ఓట్లు 841 ఉండగా.. అందులో వైసీపీ బలం 615 ఉంది.. టీడీపీ, జనసేన, బీజెపీ సభ్యులకు కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. భారీ సంఖ్యలో వైసీపీ నుంచి చేరికలు ఉంటే తప్ప , టీడీపీ కూటమి విజయం సాధించే పరిస్థితి లేదు.దీంతో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలంటే ఇంత తక్కువ సమయంలో జరిగే పని కాదు. ఈ లెక్కన చూసుకుంటే విశాఖలో కూడా టీడీపీ ఓటమి దిశగానే పయనిస్తున్నట్టు స్పష్టం అవుతోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడం కష్టమే అని రాజకీయ పండితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications