చంద్రబాబుకు సెల్యూట్ చెయ్యాలన్న వైసీపీ నేత!
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుమల లడ్డూ కల్తీ వివాదం దుమారంగా మారింది. దీనిపై ఎన్డీయే ప్రభుత్వం వైఎస్ జగన్ ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటే వైసీపీ నేతలు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రజలకు సూపర్ సిక్స్ అంటూ హామీలను గుప్పించిన చంద్రబాబు ఆ హామీల నుండి ప్రజల దృష్టి మరల్చటం కోసం ఈ విధంగా రోజుకో కొత్తకుట్ర చేస్తున్నారని టార్గెట్ చేస్తున్నారు.
చంద్రబాబుపై భగ్గుమన్న దొంతిరెడ్డి వేమారెడ్డి
చంద్రబాబు తన స్వార్ధ రాజకీయాల కోసం తిరుమల శ్రీవారిని కూడా వాడుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చెయ్యకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే పనిలో చంద్రబాబు ఉన్నారని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైయస్సార్ సిపి సమన్వయకర్త గా బాధ్యతలు చేపట్టిన దొంతిరెడ్డి వేమారెడ్డి కూడా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మంగళగిరి సమన్వయ కర్తగా బాధ్యతలు చేపట్టిన వేమారెడ్డి
నేడు మంగళగిరి బైపాస్ రోడ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మంగళగిరి సమన్వయకర్తగా బాధ్యతలు ఇచ్చినందుకు పార్టీ అధినాయకులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు. ఆపై బాధ్యతలు చేపట్టిన తొలినాడే రాష్ట్రంలో తాజా పరిణామాలపై విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
చంద్రబాబు సీనియార్టీ అంతా డైవర్షన్ పాలిటిక్స్ కే
రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.చంద్రబాబు కావాలని కక్ష పూరిత పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు .చంద్రబాబు తన సీనియార్టీ అంతా డైవర్షన్ పాలిటిక్స్ తోనే నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల వరదల సమయంలో నదిలో బోట్లు విషయంలో అనవసరపు రాద్దాంతం చేశారన్నారు.
చంద్రబాబుకు ఈ విషయంలో సెల్యూట్ చెయ్యాలి
ప్రస్తుతం తిరుమల వ్యవహారం అంతా డైవర్షనేనని, చంద్రబాబు ప్రజల నుండి వ్యతిరేఖత రాకుండా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని తెర మీదకు తెస్తారని విమర్శించారు. గతంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారని, అందుకు ఎన్నో ఘటనలు ఉదాహరణలు ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామిలను, వాగ్థానాలను నేరవేర్చకుండా కప్పిపుచ్చుకుంటూ పాలన సాగిస్తున్నందుకు చంద్రబాబుకు శాల్యూట్ చేయాల్సిందేనని దొంతిరెడ్డి వేమారెడ్డి అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ తీరు బాధాకరం
రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలంటూ, సనాతన ధర్మం అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదని, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అని అన్ని వర్గాలను సమానంగా చూడాలన్నారు. ఆయనే స్వయంగా మత కలహాలు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా పవన్ తానేం చేస్తున్నారో ఆలోచించాలన్నారు. మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా త్వరలోనే పార్టీ కమిటీలు ఏర్పరచి పార్టీని బలోపేతం చేస్తొనని వివరించారు.












Click it and Unblock the Notifications