
కోట్లాది రూపాయల అప్పు చేసిన రాష్ట్ర మంత్రి??
కోనసీమకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తమవద్ద కోట్లరూపాయలు అప్పు తీసుకున్నారని, తిరిగివ్వకుండా వాటిని ఎగ్గొట్టేందుకే అమలాపురంలో జరిగిన అల్లర్ల ఘటనలో తన ప్రమేయం ఉందంటూ అక్రమ కేసు బనాయించారని వైసీపీ యువజన నాయకుడు వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు.
అమలాపురంలోని శ్రీరామపురంలో ఉన్న తన ఇంటిపై అర్థరాత్రి సమయంలో కొందరు దాడికి పాల్పడ్డారని, బీరు సీసాలు విసిరి చంపేస్తామంటూ బెదిరించారని సుభాష్ అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తన ఇంటిపై దాడికి పాల్పడినవారి దృశ్యాలు సీసీటీవీలో నమోదవగా వాటిని చూపించారు. ఎస్పీకి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేసినట్లు వెల్లడించారు.
Recommended Video

మంత్రి విశ్వరూప్‌తోపాటు ఆయన కుమారుడు పినిపే కృష్ణారెడ్డి, మరికొందరిపై ఫిర్యాదు చేశానని వాసంశెట్టి తెలిపారు. మాజీ కౌన్సిలర్, వైసీపీ నాయకుడు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ తమ ఇంటిపై కొందరు యువకులు బీరు సీసాలు విసరడంతోపాటు సుభాష్‌ను చంపేయండంటూ అంటూ కేకలు వేశారని చెప్పారు.
తమకు మంత్రి నుంచి ప్రాణభయం ఉందని, అమలాపురం అల్లర్ల ఘటనల్లో తాము పేదలకు బెయిల్ ఇప్పిస్తుండటంతో మంత్రి కుమారుడ కృష్ణారెడ్డి తమపై కక్ష గట్టారని చెప్పారు. తనను చంపించడానికి ప్రయత్నిస్తున్నారంటూ సుభాష్ ఆరోపించారు. ఆయ ఇంటిపై దాడికి సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.