నిమ్మాడ ఘటన .. అచ్చెన్న టార్గెట్ గా, ఎస్ఈసీ నిమ్మగడ్డకు వైసీపీ నేతల ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ విమర్శలు గుప్పించటమే కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. తాజాగా టిడిపి నేతలు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబులు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో జరిగిన సంఘటనలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వైసిపి నాయకులపై ఫిర్యాదు చేసిన టిడిపి నేతలు అక్కడ కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

నిమ్మాడలో దారుణాలకు పాల్పడుతున్నారని ఎస్ఈసికి అచ్చెన్నాయుడుపై ఫిర్యాదు
ఇక ఇదే సమయంలో నామినేషన్ల సమయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామమైన నిమ్మాడలో దారుణాలకు పాల్పడుతున్నారు అంటూ వైసిపి నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అచ్చెన్నాయుడు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ అచ్చెన్నాయుడు ను అరెస్టు చేయాలని వైసీపీ నేతలు ఎస్ఈసిని డిమాండ్ చేస్తున్నారు.

అచ్చెన్న వైసీపీ బలపరిచిన అభ్యర్థిని బెదిరించారని ఫిర్యాదు ..అరెస్ట్ కు డిమాండ్
చంద్రబాబు రౌడీ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని, నిమ్మాడలో వైఎస్సార్ కాంగ్రెస్ బలపరిచిన ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థిని అచ్చెన్న ఎలా బెదిరించారో ఫోన్ కాల్ ఆధారాలు కూడా ఉన్నాయని, టిడిపి దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ స్పందించాలని అచ్చెన్న ను అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో పై ఎన్నికల కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేవలం చంద్రబాబుకు ఒక నోటీసు ఇచ్చి వదిలేశారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

టీడీపీ నేతల దౌర్జన్యాలను చంద్రబాబు ఎందుకు ఖండించటం లేదు : మల్లాది విష్ణు ఫైర్
ఇప్పటికైనా నిమ్మాడలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేలా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన పని పై చర్యలు తీసుకోవాలని వైసిపి నేతలు డిమాండ్ చేశారు. టిడిపి నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే చంద్రబాబు ఎందుకు ఖండించడం లేదని మల్లాది విష్ణు మండిపడ్డారు. నిన్న పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి రోజు కావడంతో అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడలో ఉద్రిక్తత నెలకొంది.

నిమ్మాడ ఘటనలపై టీడీపీ ఫిర్యాదుకు కౌంటర్ గా వైసీపీ నేతల ఫిర్యాదు
నిమ్మాడ నుండి ఎన్నికల బరిలోకి దిగిన కింజారపు పాపన్న ను నామినేషన్ దాఖలు చేయకుండా అచ్చెన్నాయుడు బెదిరించడం తో పాటుగా టిడిపి నేతలు అడ్డుకున్నారంటూ వైసీపీ నేతలు ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అయితే వైసీపీ నేతలు కత్తులు ,రాడ్లు , గొడ్డళ్ళతో రోడ్ల మీద హల్చల్ చేసి భయభ్రాంతులకు గురి చేశారని టీడీపీ అంటోంది. ఒకరి మీద ఒకరు వరుస ఫిర్యాడులతో టీడీపీ , వైసీపీ నేతలు రాజకీయ రచ్చ కొనసాగిస్తున్నారు .












Click it and Unblock the Notifications