హైటెక్ చంద్రబాబు లోటెక్ పనులు: విరుచుకపడిన రోజా
చిత్తూరు: గోదావరి పుష్కరాల సందర్బంగా రాజమండ్రి వద్ద జరిగిన విషాద సంఘటనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైటెక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లోటెక్ పనుల వల్లనే అనర్థం జరిగిందని ఆమె ఆరోపించారు.
రాజమండ్రి విషాద సంఘటనపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రచారంపై పెడుతున్న శ్రద్ధ భక్తుల సౌకర్యాలపై పెట్టలేదని ఆమె విమర్సించారు. మరణించిన మహిళలు, పిల్లల కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ఆమె ప్రశ్నించారు.

అధికారులను తన చుట్టూ తిప్పుకుంటూ చంద్రబాబు ప్రజలను గాలికి వదిలేశారని రోజా దుయ్యబట్టారు. ప్రచారం ఇచ్చి జనాన్ని రప్పించిన చంపించిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంత మంది ప్రాణాలు పోవడానికి చంద్రబాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
రాజమండ్రి ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆ సంఘటన తమను తీవ్రంగా కలచి వేసిందని ఆయన అన్నారు. బాధితులకు అన్ని సమయాల్లో తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం దారుణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications