30 మంది బలి, కోట్లతో పుష్కరాల సినిమానా: బాబును ఏకేసిన శ్రీకాంత్ రెడ్డి
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. గోదావరి పుష్కరాల నిర్వహణ పేరిట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం 30 మందిని బలి తీసుకుందని ఆయన అన్నారు.
రాష్ట్ర రైతులు సమస్యలతో అల్లాడుతుంటే వేల కోట్ల రూపాయలు వెచ్చించి పుష్కరాల సినిమా తీస్తారా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేస్తోందని, ఆర్భాటాలాకు మాత్రమే పెద్ద పీట వేస్తోందని ఆయన గురువారం మీడియా సమావేశంలో దుయ్యబట్టారు.
రైతాంగం నిర్వీర్యం కాక ముందే వారిని ఆదుకోవాలని, ఎకరాకు రూ.20 వేలు తక్కువ కాకుండా ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్భాటాలకు వెళ్లకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రులకు సూచించారు.

జగన్ పరామర్శ
ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో జరుపుతున్న రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగు కుటుంబాలను పరామర్శించారు. గురువారంనాడు ఆయన కల్యాణదుర్గం, పెనుకొండ నియోజకవర్గాల్లో పర్యటించారు. కంబదూరు మండలం తిమ్మాపురంలో ఆత్మహత్యకు పాల్పడిన నారాయణప్ప కుటుంబాన్ని జగన్ పరామర్శించారు.
అలాగే ఒంటాపల్లిలోని రామాంజనేయులు కుటంబాన్ని పరామర్శించారు. పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం వైటీ రెడ్డిపల్లికి చెందిన లక్ష్మీదేవి, పెద్ద పాతన్న కుటుంబాలను జగన్ పరామర్సించారు.












Click it and Unblock the Notifications