year ender 2024: వైసీపీ నుంచి కూటమి చేతికి అధికారం-పాలనలో మార్పు ఉందా ?
ఈ ఏడాది ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పటిష్టంగా కనిపించిన వైసీపీని చిత్తుగా ఓడించి విపక్షంలో ఉన్న కూటమి పార్టీలకు భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టారు. అయితే ఆరు నెలల క్రితం పాలన ప్రారంభించిన కూటమి సర్కార్ మాత్రం ఇంకా బాలారిష్టాల్ని ఎదుర్కుంటూనే ఉంది. రాష్ట్రంలో అధికార మార్పు జరిగినంత సులువుగా కొత్త ప్రభుత్వం కుదురుకోవడం లేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఏపీ రాజకీయాల్లో ఈ ఏడాది పెను మార్పులు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఐదేళ్లుగా ఏకపక్షంగా పాలించిన వైసీపీకి చెక్ పెట్టి ఓటరు కూటమికి పట్టం గట్టాడు. వైసీపీ పాలనలో వ్యక్తిగతంగా తమకు జరిగిన నష్టంతో పాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గ్రహించిన ఓటరు ఆ పార్టీని పూర్తిగా పక్కనబెట్టేశాడు. దీంతో వైసీపీ కనీవినీ ఎరుగని రీతిలో 11 సీట్లకు పరిమితమైంది. దీంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు విపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది.

మరి ఇంత ఏకపక్షంగా ఓటరు కూటమికి పట్టం గట్టాక కొత్త ప్రభుత్వంపై అంచనాల కూడా అంతే భారీగా ఉన్నాయి. వీటిని అందుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం తడబడుతున్నట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా ఐదేళ్ల పాటు నిరాటంకంగా అందాయని భావిస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిగా పక్కనబెట్టేయడం కొన్ని వర్గాలకు రుచించడం లేదు. అలాగే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇలా పలు విషయాల్లో లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. అలాగే ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి కీలక పథకాలను కూడా అమలు చేయకపోవడంతో కూటమిపై ఆ మేరకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
పాలన పరంగా చూస్తే ఆరు నెలల్లో మంత్రులు తమ శాఖలపై ఏమాత్రం పట్టు సాధించలేదని సీఎం చంద్రబాబు ప్రతీ కేబినెట్ భేటీలో చెప్తూనే ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు, ముఖ్యంగా తొలిసారి ఎమ్మెల్యేలు, మంత్రులైన వారు కూడా చురుగ్గా కనిపించడం లేదు. సీనియర్లు సరే సరి. విపక్ష వైసీపీ తమపై చేస్తున్న విమర్శలకు ఇంత భారీ మెజార్టీతో ఉన్న కూటమి ప్రభుత్వం నుంచి సరైన కౌంటర్లే పడటం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఏదైమైనా కొత్త ఏడాదిలో మరింత దూకుడుగా కూటమి ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే విపక్ష వైసీపీ కూడా పుంజుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications