గుంటూరు:ప్రేమించలేదని...యువతి,ఆమె తల్లి,చెల్లిపై ప్రేమోన్మాది దాడి
గుంటూరు:తనను ప్రేమించలేదన్నకారణంతో ఓ యువకుడు తాను ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేశాడు. అంతేకాదు ఈ దాడిని అడ్డుకోబోయిన ఆ యువతి తల్లి, చెల్లిని కూడా ఈ యువకుడు కత్తితో గాయపరిచాడు. గుంటూరు నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది.
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన ఈ ముగ్గురినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు తెలుసుకొని దాడికి పాల్పడిన యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...

గుంటూరు నగరంలోని పాత గుంటూరుకు చెందిన కొండపల్లి శ్రీనివాస్,లక్ష్మి దంపతులకు రమ్య, సౌమ్య అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్దమ్మాయి రమ్య ప్రస్తుతం అభ్యుదయ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. అయితే గత కొంతకాలంగా సుభానీ అనే యువకుడు ఈమె వెనకాల పడుతూ తనను ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. అయితే ఇందుకు రమ్య ఒప్పుకోకపోడంతో ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. తన ప్రేమను కాదన్నరమ్యను బ్రతకనీయకూడదని
నిర్ణయించుకున్నాడు.
ఆమెని చంపేందుకని పాత గుంటూరులోని రమ్య నివాసానికి వెళ్లిన సుభాని హఠాత్తుగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. రమ్య కేకలు విని అడ్డుకోబోయిన ఆమె తల్లి, చెల్లిని కూడా కత్తితో గాయపరిచాడు. వీరందరి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు చేరుకునేలోపే సుభాని అక్కడ్నుంచి పరారయ్యాడు. ఇంట్లోనే
రక్తపు మడుగులో పడివున్న రమ్యను, ఆమెతో పాటే గాయపడిన ఆమె తల్లీ, చెల్లిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రమ్యకు ఆపరేషన్ తప్పనిసరి కావడంతో అత్యవసరంగా సర్జరీ నిర్వహించారు. అనంతరం ఈ దాడికి పాల్పడిన యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications