అవినాష్ ముందస్తు బెయిల్ పై వాడీవేడిగా వాదనలు-విచారణ రేపటికి వాయిదా
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే గతవారం ఇదే పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో తిరిగి విచారణ చేపట్టేందుకు మూడు రోజులు తీసుకున్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ఇవాళ వాదనలు ప్రారంభించేందుకు అనుమతించింది. దీంతో అవినాష్ తరఫున నిరంజన్ రెడ్డి, సునీత తరపున సుప్రీం న్యాయవాది సిద్ధార్ధ లూత్రా, సీబీఐ తరఫున పీపీ నాగేంద్ర వాదిస్తున్నారు.
ముందుగా వాదనలు ప్రారంభించిన అవినాష్ రెడ్డి లాయర్ నిరంజన్ రెడ్డి.. సీబీఐ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా గూగుల్ టేకౌట్ ద్వారా సీబీఐ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చూపించడాన్నితప్పుబట్టారు. గూగుల్ టేకౌట్ కేవలం ఫోన్ ఎక్కడుందనేది మాత్రమే చెబుతుందని, దాన్నివాడుతున్నవ్యక్తిని కాదని తెలిపారు. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు 20 మీ లొకేషన్ తేడా చూపిస్తుందని గూగుల్ చెప్తుందన్నారు. అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి బెయిల్ పిటిషన్ ను సీబీఐ వ్యతిరేకించకపోవడం, తాను కోరుకున్న విధంగా దస్తగిరి చెప్పేలా సీబీఐ ఒత్తిడి తెచ్చిందంటూ హైకోర్టు దృష్టికి తెచ్చారు.

అలాగే అవినాష్ రెడ్డిని నిందితుడిగా మార్చేందుకు సీబీఐ హియర్ అండ్ సే సాక్ష్యంపై ఆధారపడిందని కూడా అవినాష్ లాయర్నిరంజన్ రెడ్డి ఆరోపించారు. అయితే హియర్ అండ్ సే ద్వారా తీసుకున్న సాక్ష్యం చెల్లదని స్పష్టం చేశారు. అలాగే దస్తగిరి అరెస్ట్ అయినప్పుడు వివేకా హత్యలో ఐదుగురు మాత్రమే ఉన్నారని చెప్పాడని, తర్వాత సీబీఐ మరో స్టేట్‍మెంట్ తీసుకుందన్నారు. అందులో అవినాశ్, భాస్కర్ రెడ్డి పేర్లు చెప్పారన్నారు. తర్వాత దస్తగిరి ముందస్తు బెయిల్ కోరితే సీబీఐ వ్యతిరేకించలేదని గుర్తుచేశారు. ఇలా ముందస్తు బెయిల్‍ను సీబీఐ వ్యతిరేకించకపోవడం న్యాయ సమ్మతం కాదన్నారు.
ఇవాళ అవినాష్ రెడ్డి లాయర్ వాదనలు ముగిసిన తర్వాత సునీతారెడ్డి, సీబీఐ తరఫు న్యాయవాదులు కూడా తమవాదనలు వినిపించారు. అయితే సమయం ముగియడంతో హైకోర్టు తిరిగి రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు విచారణను వాయిదా వేసింది. దీంతో అవినాష్ బెయిల్ వ్యవహారంపై రేపటి వరకూ ఎదురుచూడాల్సిన పరిస్దితి.












Click it and Unblock the Notifications