130 సీట్లు, జగన్‌కు కోపం రాదు: భారతి, కెఏ పాల్ ఫైర్
కడప/విజయవాడ: ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో 130 సీట్లు గెలుచుకోవడం ఖాయమని వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి ధీమా వ్యక్తం చేశారు. జనం గుండెల్లో ఇప్పటికీ వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నారన్నారు. ప్రచార సభలకు వస్తున్న ప్రజల్లో ఉప్పొంగుతున్న అభిమానాన్ని చూస్తే స్పష్టమవుతోందన్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
కడప జిల్లాలో భారతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. జగన్, అవినాష్ రెడ్డికి మద్దతుగా ఆమె ప్రచారం చేస్తున్నారు. పార్టీ గెలుపు కోసం పులివెందుల నుండి పోటీ చేస్తున్న జగన్ సీమాంధ్ర వ్యాప్తంగా తిరుగుతుండగా.. భారతి భర్త మెజార్టీ గెలుపు కోసం కడపలో ప్రచారం చేస్తున్నారు. జగన్‌కు కోపమంటే ఏమిటో తెలియదన్నారు.

వైయస్ జగన్ వెండి పళ్లెంలో పుట్టినప్పటికీ ఇప్పుడు చాలా కష్టాలు పడ్డారన్నారు. అయినా వెనక్కి అడుగేయలేదన్నారు. జగన్‌కు కోపం రాదన్నారు. జగన్ జైలులో ఉన్నప్పుడు తమకు నరకం కనిపించిందన్నారు. జైల్లోను జనం కోసమే జగన్ ఉన్నారన్నారు. ఆయన బెస్ట్ సిఎం అవుతారని చెప్పారు.
జగన్ పైన నిప్పులు చెరిగిన పాల్
సీమాంధ్రలో రాక్షస పాలన రాకుండా చూడాలని కెఏ పాల్ వేరుగా అన్నారు. ఆయన సీమాంధ్రలో బిజెపి, టిడిపిల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయల లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని గాడిలో పెట్టగల నేత చంద్రబాబు నాయుడే అన్నారు. అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో అనుకూల ప్రభుత్వాలు ఏర్పడాలని ఆయన తెలిపారు. 140 దేశాలు తిరిగిన వ్యక్తిగా అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు.
పెప్పర్ స్ప్రేలు, వ్యాఖ్యలు, పార్టీలు పెట్టడాలు అన్నీ 10 జనపథ్ మార్గదర్శకత్వంలో జరిగాయని, అందుకే కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో అడుగు పెట్టగలిగారన్నారు. లక్ష కోట్లు దోచుకున్న వారిపై విచారణ ఎందుకు జరపలేదన్నారు. బాబులాంటి నేతలు సీమాంధ్రకు అవసరమన్నారు. లక్ష కోట్లు దోచిన వాళ్లకు ఓటేస్తారా లేక రుణమాఫీ చేస్తానన్న బాబుకా అన్నారు.
మోడీ, బాబు రావాలన్న కృష్ణయ్య
దేశం, రాష్ట్రం బాగుపడాలంటే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడులు అధికారంలోకి రావాలని బిసి సంఘాల అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. కాంగ్రెసు హయాంలో వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని, యూపిఏ భ్రష్టు పట్టిపోయిందన్నారు. బాబుతోనే బిసిలకు న్యాయమన్నారు. కొత్త రాజధాని నిర్మాణం బాబుకే సాధ్యమని చెప్పారు.












Click it and Unblock the Notifications