కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ భారతి.. షర్మిలకు జగన్ చెక్..?
ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అధికార వైసీపీని ఢీ కొట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకం అవుతున్నట్టే కనిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్‌ను ఎదుర్కొనడానికి టీడీపీ-జనసేన చేతులు కలుపగా.. బీజేపీ పయనం ఎటువైపో మరి కొద్దిరోజుల్లో తేలిపోనుంది. ఇక రాష్ట్రంలో ఉనికి లేని కాంగ్రెస్ పార్టీ సైతం ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే సీఎం జగన్ సోదరి షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని వైసీపీకి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే కనుక జగన్ పార్టీకి కొన్ని ఇబ్బందులు తప్పవు. వైసీపీలో టికెట్ దక్కని ఎమ్మెల్యేలు, అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఇదే సమయంలో షర్మిల వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ షర్మిల కడప బరిలో ఉంటే జగన్ రాజకీయ అడుగులు ఏవిధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.

కడప పార్లమెంట్ స్థానం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. గతంలో వైఎస్ఆర్, వైఎస్ వివేకనంద రెడ్డి, జగన్ , అవినాష్ రెడ్డి... ఇలా వైఎస్ కుటుంబ సభ్యులు కడప పార్లమెంట్ స్థానానికి ప్రతినిధ్యం వహించారు. వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం కడపగా ఎంపీగా ఉన్నారు. ఆయన్ను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ చూస్తున్నారు. అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయిస్తారని సమాచారం.

కడప ఎంపీగా కుటుంబ సభ్యుడైనా డాక్టర్ అభిషేక్ రెడ్డిని బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల సమయంలోనూ అభిషేక్ రెడ్డి పేరు రాజకీయంగా తెర మీదకు వచ్చింది. కాని ఆ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపారు. ప్రస్తుతం అభిషేక్ రెడ్డి సింహాద్రిపురం, లింగాల మండలాల వైసీపీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో అభిషేక్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. కాని షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగితే.. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తికరంగా మారింది.

రాజకీయాల్లో సెంటిమెంట్‌కు తావు లేదనే విషయం జగన్‌కు బాగా తెలుసు. షర్మిలను ధీటుగా ఎదుర్కొనకపోతే అది మొదటికే మోసం వస్తుందని.. అందుకే బలమైన అభ్యర్థిని ఆమెపై దించుతారని టాక్ అధికార పార్టీలో నడస్తోంది. నిజంగానే షర్మిల కడప బరిలో ఉంటే ఆమెపై వైఎస్ భారతిని సైతం పోటీకి దించడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. లేకుంటే అంతకుమించి వ్యూహాన్ని అమలు చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. షర్మిల అడుగులు బట్టి జగన్ వ్యూహాలు ఉంటాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి షర్మిలపై జగన్ ఎలాంటి రాజకీయ వ్యూహాలను అమలు చేస్తారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications