టిఆర్ఎస్ దూతగా జగన్, టిఆర్ఎస్‌వాళ్లు మెత్తబడ్డారు: యనమల
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) దూతగా మారారని మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఎవరి వకల్తా పుచ్చుకొని జగన్ ఢిల్లీకి వెళ్లారని ఆయన ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్రం కోర్టులో ఉందని, ట్యాపింగ్‌పై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతామని ఆయన శుక్రవారం మీడియాతో చెప్పారు.. సెక్షన్-8 అమలు చేయమని కేంద్రాన్ని కోరామన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై తాము ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేసిన తర్వాత టిఆర్ఎస్ వాళ్లు మెత్తబడ్డారని ఆయన అన్నారు.
ఎవరి వత్తాసు తీసుకుని జగన్ కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. ఢిల్లీ నుంచి అందరూ తిరిగి వచ్చేసినా జగన్ టిఆర్ఎస్ రాయబారిగా అక్కడే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 120 పోన్లను ట్యాప్ చేసిందని కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

ఫోన్లను ట్యాప్ చేసి నచ్చిన పదాలను అతికించుకున్నారని, అందుకే ఐదు రోజుల తర్వాత ఆడియోలను టీ న్యూస్ ద్వారా విడుదల చేశారని ఆయన అన్నారు. తమ వద్ద రికార్డులు ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి చెప్పారని, తాము కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పేసరికి ఎసిబి డిజి ఎకె ఖాన్‌తో ఖండన ఇప్పించారని ఆయన వ్యాఖ్యానించారు.
మంత్రుల కోసం విజయవాడలో అపార్టుమెంట్ చూడాలని అధికారులను కోరామన్నారు. సాధ్యమైనంత త్వరగా హెచ్‌వోడీల తరలిస్తామన్నారు. అద్దెకు అపార్ట్‌మెంట్లు దొరికితే మారిపోతామని ఆయన చెప్పారు.
పట్టిసీమపై మాట్లాడే హక్కు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు లేదని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కనుసన్నల్లోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పనిచేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications