చంద్రబాబును లాగి లెంపకాయ కొట్టండి: ప్రత్యేక హోదాపై జగన్

కాకినాడ: ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వార్థం కోసం తాకట్టు పెట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. కాకినాడ యువభేరీ కార్యక్రమంలో ఆయన బుధవారంనాడు ప్రసంగించారు. ప్రత్యేక హోదా కోసం చొక్కా పట్టుకుని నిలదీయాలని అన్నారు.

ప్రత్యేక హోదా వల్ల గ్రాంట్స్ వస్తాయని, కేంద్రం ఇచ్చే డబ్బులను వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని, 90 శాతం గ్రాంట్‌గా పది శాతం రుణంగా వస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా లేని రాష్ట్రానికి 30 శాతం మాత్రమే గ్రాంట్‌గా వస్తుందని, ప్రత్యేక హోదా వల్ల మంచి జరుగుతుందని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో పారిశ్రమల స్థాపనకు ప్రత్యేక రాయితీలు ఇస్తారని, ఇతర రాష్ట్రాలకు అటువంటి రాయితీలు ఇవ్వరని ఆయన అన్నారు. వంద శాతం ఆదాయం పన్ను మినహాయింపు ఇస్తారని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమల స్థాపనకు ఇచ్చే రాయితీలను ఆయన వివరించారు.

ప్ర్తత్యేక హోదా వస్తే చంద్రబాబు మలేసియా, సింగపూర్ వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రధాని మోడీ వద్దకు వెళ్తి ప్రత్యేక హోదా సాధిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా వస్తే అందరూ రాష్ట్రానికి బారులు తీరుతారని ఆయన అన్నారు. చంద్రబాబు అన్నీ తెలుసునని, అయినా చేయరని ఆయన అన్నారు.

YS Jagan

ప్రత్యేక హోదా ఎప్పుడు, ఎందుకు ఇస్తామన్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు మనకు ఇష్టం లేకపోయినా హైదరాబాదును మన నుంచి విడదీశారని, చదువులు పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్ వెళ్తారని, సాఫ్ట్‌వేర్‌లో 95 శాతం ఉద్యోగాలు హైదరాబాదులో ఉన్నాయని, పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయని ఆయన అన్నారు.

అటువంటి హైదరాబాద్ నగరాన్ని దూరం చేసినందుకు జరిగే నష్టాన్ని పూడ్చేందుకు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు ఇవ్వాలని బిజెపి సభ్యులు, టిడిపి సభ్యులు అడిగారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్రాన్ని విడగొట్టారని ఆయన చెప్పారు.

ఎన్నికలకు వెళ్లినప్పుడు రకరకాల కరపత్రాలు పంచారని, ఎన్నికల ప్రణాళికలను చంద్రబాబు విడుదల చేశారని జగన్ అంటూ ప్రత్యేక హోదాను ఐదేళ్ల నుంచి పదేళ్లు పొడగిస్తామని బిజెపి హామీ ఇచ్చిందని చెప్పారని అన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందని అన్నారని, ప్రతి ఇంటికి వెళ్లి చెప్పారని, అప్పుడు ప్రతి టీవీలోనూ ఆ విషయం కనిపించిందని, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కరు ప్రధాని కుర్చీలో, మరొకర ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయారని ఆయన అన్నారు.

ఈ మధ్య కాలంలో ప్యాకేజీ అనే కొత్త పదం తెస్తున్నారని, ప్యాకేజీ ఇస్తుందని వచ్చి చెప్తే చంద్రబాబును లాగి చెంపకాయ కొట్టండని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామన్నారూ... ప్రాజెక్టులు ఇస్తామన్నారు... విశ్వవిద్యాలయాలు ఇస్తామన్నారు.. ఆ రోజు ఇస్తామన్నవే ఇవ్వాలని అడగాలని ఆయన అన్నారు. ఆ రోజు రాష్ట్రాల పునర్విభజన చట్టంలో ఉన్నవే అమలు చేయాలని ఆయన అన్నారు.

ప్యాకేజీ అని కొత్తది ముందుకు తెచ్చి స్వార్థం కోసం ప్రత్యేక హోదాను ఎందుకు తాకట్టు పెడుతున్నారో చంద్రబాబును నిలదీయాలని ఆయన అడిగారు. ప్రత్యేక హోదా గురించి అడిగితే రోజుకో అబద్ధం చెబుతున్నారని ఆయన అన్నారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదని కేంద్ర ప్రభుత్వంలోనివారు అంటున్నారని, ఇలా అన్నప్పుడు బాధ అనిపిస్తుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా ఇస్తే నిధులు తక్కువగా వస్తాయనే చంద్రబాబు ప్రచారంలో నిజం లేదని, ఎన్ని నిధులు ఇవ్వాలనే ఫార్ములా ఏమీ లేదని ఆయన అన్నారు. నీతి అయోగ్ చైర్మన్ ప్రధాన మంత్రి, క్యాబినెట్‌కు చైర్మన్ ప్రధాని అని, మోడీ సంతకం పెడితే ప్రత్యేక హోదా వస్తుందని అంటున్నారు. క్యాబినెట్ తలుచుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వవచ్చునని ఆయన చెప్పారు.

తాము కూడా చదువుకున్నామని, మీరు డిగ్రీలు పాసయ్యారో తెలియదు గానీ ఈ తరం వాళ్లం చదువుకున్నాం, తెలియని విషయాలు తెలుసుకుంటామని చంద్రబాబును అడగాలని ఆయన అన్నారు. ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇవ్వకపోవడం అనే విషయంతో సంబంధం లేదని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వాలని గత మన్మోహన్ సింగ్ మంత్రివర్గం నిర్ణయం చేసి ప్రణాళిక సంఘానికి రాసిందని, ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ వచ్చిందని, దానికి ముందు నరేంద్ర మోడీ ప్రధానిగా ఉంటూ ప్రణాళిక సంఘంలో ఎనిమిది నెలలపాటు ఆ ఫైల్ అలాగే పడి ఉందని ఆయన చెప్పారు.

చంద్రబాబు మెడలు వంచడం గానీ కేంద్రంపై ఒత్తిడి తేవడం గానీ జగన్ ఒక్కడు తలుచుకుంటే సాధ్యం కాదని, మనమంతా కలిసి ఒక్కటై ఒత్తిడి తేవాలని, ఒత్తిడి తెస్తేనే ఇవాళ కాకున్నా రేపైనా ఇస్తారని, ఒత్తిడి తేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటారని, మరిచిపోతారని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా లంచాలు తీసుకుని, తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు ఇస్తూ చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని, ఆ కేసు నుంచి బయటపడడానికి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని పక్కన పెట్టుకుని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభలో ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చి మాట తప్పారని, ఎందుకు మాట తప్పారని చంద్రబాబు అడగడం లేదని ఆయన అన్నారు. గడువు పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్ర మంత్రి వర్గం నుంచి తమ పార్టీ బయటకు వస్తుందని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ఆయన అడిగారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులను ఉపసంహరించరు, ప్రత్యేక హోదా అడగరని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధంగా లేదు కాబట్టి ప్రత్యేక హోదా వృధా అని చంద్రబాబు అంటున్నారని, ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంటే విశాఖలోనో మరో చోటనో సభ పెట్టి ప్రత్యేక హోదాను తానే సాధించానని, దానికి కోసం చెమటోడ్చానని చెబుకుంటారని ఆయన అన్నారు.

రాష్ట్ర విడిపోయిన తర్వాత ఎన్ని ఉద్యోగాలున్నాయో లెక్క కట్టి లక్షా 42 పైచిలుకు ఉద్యోగాలున్నాయని చెప్పినా ఆ ఉద్యోగాలు ఎప్పుడిస్తారో చెప్పడం లేదని, ఎపిపిఎస్సీ పరీక్షల కోసం చదువుకుంటున్నారని వైయస్ జగన్ అన్నారు. ప్రభుత్వం వచ్చి 20 నెలలవుతోందని, పరీక్షలు ఎప్పుడు పెడుతారో తెలియడం లేదని, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+