అవినాశ్ స్థానంలో యువనేతకు జగన్ బాధ్యతలు, పార్టీలో కీలక మార్పులు..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి వర్సస్ వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. కూటమిగానే కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవటం పైన ఫోకస్ చేసాయి. ఇటు జగన్ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీలోనూ కీలక మార్పులకు సిద్దమయ్యారు. యువతకు పార్టీలో ప్రాధాన్యత పెంచేలా నిర్ణయాలు చేస్తున్నారు. జగన్ నిర్ణయాలు పార్టీలో ఆసక్తి కరంగా మారాయి.
2024 ఎన్నికల్లో ఓటమి పై సమీక్ష తరువాత జగన్ తన నిర్ణయాల్లో మార్పులు చేస్తున్నారు. వైసీపీ సమన్వయకర్తలు.. జిల్లా అధ్యక్షులను నియమించిన జగన్.. ఇప్పుడు పార్టీ రాష్ట్ర స్థాయిలో మార్పు లపైన కసరత్తు చేస్తున్నారు. త్వరలో రీజియన్ల వారీగా తొలుత సమీక్షలు చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఆ తరువాత తన జిల్లా పర్యటనలు ప్రారంభించాలని భావిస్తున్నారు.అదే విధంగా ఆ నియోజకవర్గాల్లో వైసీపీ నేతల పని తీరు.. అవసరమైన మార్పుల పైన పూర్తి సమాచారం సేకరించారు. దీనికి అనుగుణంగా వచ్చే నెలలో పార్టీ పరంగా కీలక మార్పులకు సిద్దమైనట్లు సమాచారం. ఇక.. సొంత జిల్లా కడపలో పార్టీలో చేపట్టాల్సిన నియామకాలు.. మార్పుల పైన జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బాధ్యతల మార్పు పైన జగన్ కసరత్తు చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఎంపీగా ఉంటూనే.. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో బాధ్యతలను అవినాశ్ పర్యవేక్షిస్తున్నారు. 2024 ఎన్నికల వేళ సునీత - షర్మిల ప్రచారం వేళ.. వివేకా హత్య కేసులో అవినాశ్ ను టార్గెట్ చేసారు. ఇప్పుడు అవినాశ్ స్థానంలో పులివెందుల బాధ్యతలను యువ నేత దుష్యంత్ రెడ్డికి అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న దుష్యంత్ 2024 ఎన్నికల సమయంలో జమ్మలమడుగులో పార్టీ కోసం పని చేసారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో దుష్యంత్ ను పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ గా పోటీ చేయించి.. స్థానిక బాధ్యతలు అప్పగించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
టీడీపీ నుంచి బీటెక్ రవి సోదరుడు పోటీకి దిగే అవకాశం ఉండటంతో.. దుష్యంత్ వైపు జగన్ చూస్తున్నట్లు సమాచారం. అదే విధంగా సతీష్ రెడ్డికి కీలక బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర స్థాయి పదవుల్లోనూ మార్పులు జరగనున్నాయి. పార్టీ కోసం బలమైన వాయిస్ వినిపిస్తున్న వారి సేవల కోసం కసరత్తు జరుగుతోంది. అదే సమయం లో అవినాశ్ ను జమ్మలమడుగు.. మైదుకూరు బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం. జమ్మల మడుగులో సుధీర్ రెడ్డి ఇంఛార్జ్ గా ఉన్నా.. అక్కడ ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో జగన్ ప్రత్యేకంగా అక్కడ ఫోకస్ చేస్తున్నారు. వచ్చే నెల ఈ మార్పులకు సంబంధించి జగన్ పార్టీ ముఖ్యులతో చర్చ తరువాత నిర్ణయం వెల్లడించనున్నారు.












Click it and Unblock the Notifications