YSRCP List: టీడీపీ, జనసేన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో వీరికే టికెట్లిచ్చిన జగన్..!
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సరిగ్గా రెండు గంటల ముందు సీఎం వైఎస్ జగన్ ఈసారి పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల జాబితాను ఇడుపుల పాయలో విడుదల చేశారు. ఇందులో దాదాపుగా ఊహించిన పేర్లే ఉన్నాయి. ఇప్పటికే చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీట్లు దక్కించుకున్న వారి పేర్లే ఇందులో కనిపించాయి. అదే సమయంలో గతంలో టీడీపీ, జనసేన నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఐదుగురిలో ముగ్గురికి మాత్రమే ఈసారి సీట్లు దక్కాయి.
గత ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించారు. ఇందులో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఓ జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. వీరిలో టీడీపీకి చెందిన విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీలోకి ఫిరాయించారు. వీరితో పాటు జనసేనకు చెందిన రాపాక వరప్రసాద్ కూడా ఫిరాయించారు.

వీరందరిపైనా ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రకటించి వైసీపీ అభ్యర్ధుల జాబితాల్లో వీరిలో ముగ్గురికి సీట్లు దక్కాయి. అలా అసెంబ్లీ అభ్యర్ధులుగా సిట్టింగ్ సీట్లు దక్కించుకున్న వారిలో విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు. అలాగే చీరాల నుంచి కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ కు కూడా సీటు దక్కింది. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు మాత్రం అమలాపురం ఎంపీ అభ్యర్ధిగా జగన్ ప్రమోషన్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications