వీరిని వైఎస్ జగన్, చంద్రబాబు ఇద్దరూ మార్చలేరు..?
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హోరాహోరీగా తలపడుతోంది. రాబోయే ఎన్నికల్లో అధికారం కోసం ఈ రెండుపార్టీలు మరోసారి మదగజాల్లా తలపడబోతున్నాయనేది సుస్పష్టం. అటువంటి పార్టీలకు ఒక విషయంలో మాత్రం సారూప్యత కనపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబుకానీ తమ తమ పార్టీల్లో ఉన్న కొందరు నేతల వ్యవహారశైలిని, పనితీరును మార్చలేకపోతున్నారు. ఈ విషయం ఇరు పార్టీల్లోను ఆందోళనకు కారణమవుతోంది.

ఇంకా సమయం ఉందిగా.. అప్పుడే ఎందుకు?
టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు చెమటోడుస్తుంటే కొందరు తెలుగు తమ్ముళ్లు మాత్రం చోద్యం చూస్తున్నారు. వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ తలపోస్తుంటే తమకేం పట్టనట్లుగా కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు టీడీపీ, వైపీలో చర్చనీయాంశమైంది. తిరిగి అధికారంలోకి రావడానికి కష్టపడాలి... కానీ ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది.. ఇప్పుడే అనవసరంగా ఖర్చు పెట్టడం ఎందుకని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

టీడీపీ ఇన్‌ఛార్జిలు దూరంగా..
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు. ఇటువంటివారందరినీ పార్టీ అధిష్టానం గుర్తించి రాబోయే ఎన్నికల్లో దూరం పెట్టే అవకాశం ఉందంటున్నారు. మరికొందరు బలమైన నేతలుగా ఉండటంతో కచ్చితంగా సీటివ్వాల్సిన పరిస్థితి ఉందని, వీరిని ఎలా మార్చాలనే విషయమై అధిష్టానం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో కార్యక్రమం జరిగినప్పుడు లేదా చంద్రబాబు హాజరైనప్పుడు మాత్రమే కనపడి, తర్వాత ప్రజలకు ముఖం చాటేస్తున్నారు. ఈ తరహా తీరును నివారించాలంటే కఠిన వైఖరి అవలంబించడం ఒక్కటే మార్గమని అధినేత భావిస్తున్నట్లు తెలిపారు.

పనితీరు మారకపోతే సీటు కష్టం?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి జగన్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొందరు ఎమ్మెల్యేలు తమ ఇంటి గడప దాటడంలేదని, మరికొందరు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని వారితో సమావేశమైనప్పుడు జగన్ నేరుగా తెలిపారు. ఇటువంటివారు 60 మంది వరకు ఉంటారని, ఆరునెలల్లో పనితీరు మార్చుకోకపోతే ఈసారి ఎన్నికల్లో సీటివ్వని స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉండాలని చెబుతున్నపపటికీ పట్టించుకోనివారందరిపై ప్రభుత్వం దృష్టిసారించింది. సీటివ్వనని గట్టిగా చెప్పినప్పటికీ వారిలో మార్పురాకపోతే ప్రక్షాళన ఖాయమని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.












Click it and Unblock the Notifications