గౌతం రెడ్డి భౌతిక కాయానికి జగన్, చంద్రబాబు నివాళులు-కుటుంబ సభ్యుల ఉద్వేగం
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు మేకపాటి ఇంటికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి ఘనంగా నివాళులు అర్పించారు. వీరితో పాటు ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, సీనియర్ రాజకీయ నేతలు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
ముందుగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో సీఎం జగన్ మేకపాటి గౌతం రెడ్డి నివాసానికి చేరుకున్నారు. సతీమణి వైఎస్ భారతితో కలిసి వచ్చిన సీఎం జగన్.. మేకపాటి గౌతం రెడ్డి మృతదేహం చూడగానే బరువెక్కిన హృదయంతో మౌనంగా ఉండిపోయారు. ఆయన మృతదేహంపై పూలగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. కాసేపు మృతదేహం వద్ద అలాగే నిలబడిపోయారు. ఆ సమయంలో మేకపాటి తల్లి జగన్ వద్దకు వచ్చారు. ఆపకుండా రోదిస్తున్న ఆమెను హత్తుకుని జగన్ ఓదార్చారు. అలాగే మేకపాటి తండ్రి, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డిని కూడా కౌగిలించుకుని ఓదార్చారు. అనంతరం కాసేపు అక్కడే ఉండి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

అనంతరం టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు కూడా పార్టీ నేతలతో కలిసి మేకపాటి ఇంటికి వెళ్లారు. మేకపాటి మృతదేహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించిన తర్వాత గౌతంరెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డితో కాసేపు మాట్లాడారు. గౌతం రెడ్డి మృతికి దారి తీసిన కారణాలపై ఆరా తీశారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాష్ట్రానికి మేకపాటి చేసిన సేవల్ని, వివాదరహితంగా పనిచేసిన తీరును గుర్తుచేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు.

తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసానితో పాటు ఎంపీ సురేష్ రెడ్డి, పలువురు నేతలు మేకపాటి గౌతం రెడ్డి మృతదేహాన్ని సందర్శించారు. ఏపీ నుంచి వైసీపీకి చెందిన పలువురు నేతలు, మంత్రులు మేకపాటి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

Recommended Video
వీరంతా మేకపాటితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పిన్న వయసులో గౌతంరెడ్డి తనువు చాలించడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications