విజయవాడ బస్సు ప్రమాదంపై జగన్ సీరియస్-సమగ్ర విచారణ-మృతుల కుటుంబాలకు 10లక్షలు..
ఏపీలోని విజయవాడ బస్టాండ్లో ఇవాళ జరిగిన బస్సు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విజయవాడ బస్టాండ్‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్ విచారం వ్యక్తంచేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఉదయం సీఎం వైఎస్ జగన్ కు అధికారులు ప్రమాద ఘటనపై వివరాలను అందించారు. ఆర్టీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని జగన్ ఆదేశాలు జారీచేశారు.

ఇవాళ ఉదయం విజయవాడ బస్టాండ్ లోని 12వ నంబర్ ప్లాట్ ఫామ్ పై విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేందుకు ప్రయాణికులు ఎదురుచూస్తున్న సమయంలో మెట్రో డీలక్స్ బస్సు ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బస్సు కండక్టర్ తో పాటు ఓ పదినెలల చిన్నారి, మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనతో విజయవాడ బస్టాండ్ లో భీతావహ పరిస్ధితి నెలకొంది.
మరోవైపు ఆర్టీసీ బస్సు ప్రమాదం దురదృష్టకరమని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రమాదానికి రెండు వాదనలు వినిపిస్తున్నాయన్నారు. 24 గంటల్లో విచారణ పూర్తిచేసి కారణం తెలుసుకుంటామన్నారు. విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. మృతుల కుటుంబానికి ఆర్టీసీ తరఫున రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామన్నారు. అలాగే గాయపడిన వారికి ఆస్పత్రి ఖర్చులు భరిస్తామన్నారు. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications