ఉమ్మడి పౌరస్మృతిపై వైసీపీ నిర్ణయం ఇదే! ముస్లిం నేతలకు తేల్చిచెప్పిన జగన్..!
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటికే న్యాయకమిషన్ అభిప్రాయ సేకరణ చేస్తున్న ఉమ్మడి పౌరస్మృతిని త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బిల్లు రూపంలో తెచ్చేందుకు కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముస్లింలు అప్రమత్తమవుతున్నారు. ఇప్పటికే లా కమిషన్ కు ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాలు పంపిన ముస్లింలు.. ఇప్పుడు ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి పెంచుతున్నారు.
ఈ క్రమంలో పార్లమెంటులో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును కేంద్రం తెస్తే వైసీపీ ఏం చేయబోతోందన్న ఉత్కంఠ కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే ముందుగావైసీపీ ముస్లిం నేతలతో సీఎం జగన్ ఇవాళ సమావేశమయ్యారు. యూసీసీపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్లమెంటులో కేంద్రం ఉమ్మడి పౌరస్మృతిపై బిల్లు తీసుకొచ్చే అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. ఫైనల్ గా వారికి వైసీపీ వైఖరి ఏంటో క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ముస్లిం నేతలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

యూసీసీ ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం మత పెద్దలు సీఎంకు తెలిపారన్నారు. మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం చెప్పారన్నారు.
ముస్లింలకు నష్టం జరగకుండా తాను ముందుండి పోరాడతానని సీఎం హామీ ఇచ్చారని అంజాత్ బాషా వెల్లడించారు. ముస్లింలు ఎవరూ అభద్రతకు గురికావద్దని, అధైర్యపడవద్దని సీఎం వెన్నుతట్టి అభయమిచ్చారన్నారు. యూసీసీ పై డ్రాఫ్ట్ కూడా రాలేదని సీఎం చెప్పారన్నారు. ముస్లింలకు నష్టం కల్గేలా ఉంటే పార్లమెంట్ లో యూసీసీ బిల్లును తాము వ్యతిరేకిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు.
తాను మహిళల పక్షపాతినని సీఎం జగన్ తమకు చెప్పారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వెల్లడించారు. మా ఇస్లాంలో మహిళలకు పూర్తి స్వేచ్చ ఉందని, యూసీసీ వల్ల జరిగే నష్టాలపై తమతో సీఎం చర్చించారని ఆయన తెలిపారు. ముస్లింలకు తోడుగా అండగా ఉంటానని సీఎం హామీ ఇస్తారన్నారు. తాను మైనార్టీ పక్షపాతినని సీఎం స్పష్టంగా చెప్పారని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా వెల్లడించారు. యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తామని సీఎం స్పష్టంగా చెప్పారన్నారు. యూసీసీపై ఇంకా డ్రాఫ్ట్ కూడా కాలేదని , పార్లమెంట్లో బిల్లు రాదని సీఎం చెప్పారన్నారు. యూసీసీ వల్ల నష్టం జరుగుతుందని తెలిస్తే తాను వ్యతిరేకిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.












Click it and Unblock the Notifications