చంద్రబాబు, లోకేష్ పై జగన్ భారీ ప్లాన్-సొంతింటికే పరిమితమయ్యేలా ! కలిసొస్తున్న సమీకరణాలివే !
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యాయి. అలాగే టీడీపీ అధికారం కోల్పోయి కూడా మూడేళ్లు దాటిపోయాయి. అయితే ఈ మూడేళ్లలో రాష్ట్రంలో రాజకీయాలు చాలా మారాయి. అయినా అధికార వైసీపీని దాటి అధికారం దిశగా టీడీపీ అడుగులేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏ సర్వే చూసినా, సాధారణ ప్రజల్ని అడిగినా ఇదే సమాధానం వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో విపక్షానికి ఆ అవకాశం కూడా ఎందుకివ్వాలని భావిస్తున్న జగన్.. చంద్రబాబు, లోకేష్ పై మరింత పట్టు బిగిస్తున్నారు.

జగన్ వర్సెస్ చంద్రబాబు
ఏపీలో ఇప్పటికే 2014, 2019 ఎన్నికల్లో రాజకీయ పోరు జగన్ వర్సెస్ చంద్రబాబుగానే సాగింది.ఇందులో 2014లో చంద్రబాబు పైచేయి సాధిస్తే 2019లో జగన్ అంతకు రెట్టింపు విజయంతో పైచేయి సాధించారు. అయితే ఈ పోరు ఎంతోకాలం కొనసాగాలని జగన్ కోరుకోవడం లేదని తెలుస్తోంది. అంటే తన ప్రత్యర్ధి ఎవరనే ఆలోచన కూడా ఓటర్లకు, రాష్ట్రంలో ప్రజలకు రాకూడదనే ఆయన భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో జగన్ కు పోటీ ఎవరంటే ఎవరూ లేరనే సమాధానం రావాలనేది కొత్త వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే క్షేత్రస్ధాయిలో పరిణామాలు మారిపోతున్నాయి.

చంద్రబాబుపై వ్యూహమిదే
కొత్త రాష్ట్రంలో ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు చంద్రబాబుతో ముఖాముఖీ తలపడిన జగన్ కు ఈసారి మాత్రం ఆ ప్రచారం జరగకూడదని కోరుకుంటున్నారు. ఈసారి చంద్రబాబుతో తనకు ముఖాముఖీ అనే మాట వినపడకుండా చేసేందుకు విపక్ష నేతను సొంత నియోజకవర్గానికే పరిమితం చేసే దిశగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే స్ధానిక ఎన్నికల్లో వైసీపీని కుప్పంలో గెలిపించిన జగన్.. దాన్ని అసెంబ్లీ ఎన్నికల వరకూ తీసుకెళ్లగలిగితే కుప్పంలో చంద్రబాబుకు ఓటమి రుచి చూపించవచ్చని భావిస్తున్నారు. దీంతో తాజాగా కుప్పానికి ఎన్నడూ లేని విధంగా రూ.66 కోట్లు కేటాయించారు. నాకు గెలుపు కావాలి, మీకేం కావాలంటూ నేరుగా అక్కడి నేతల్నే ప్రశ్నిస్తున్నారు జగన్. ఇందుకు తగినట్లుగానే వారు అడిగిందల్లా ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారు. అదే సమయంలో కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసే అభ్యర్ధిని కూడా ఇప్పటికే ఖరారు చేసేసారు.

మంగళగిరిలో లోకేష్ కు కళ్లెం
మంగళగిరి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగి ఓటమిపాలైన నారా లోకేష్.. ఇప్పటి నుంచే నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు. అదే సమయంలో స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీన్ని గమనించిన జగన్.. లోకేష్ కు అవకాశం దక్కకుండా చేసేందుకు టీడీపీ సీనియర్ నేత,స్ధానిక చేనేత కార్మికుడు గంజి చిరంజీవిని వైసీపీలోకి రప్పిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా గత ఎన్నికల్లో లోకేష్ కు కాస్తో కూస్తో ఓట్లు వచ్చేలా చేయడంలో కీలకపాత్ర పోషించిన చిరంజీవిని తమ పార్టీలోకి రప్పించి, వీలైతే ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.
Recommended Video


సొంతింటికే పరిమితం చేసే వ్యూహం ?
స్ధూలంగా చెప్పాలంటే చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కు కూడా తమ సొంత నియోజకవర్గాలకు కట్టడి చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వారు తిరిగి వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా చూసుకోవాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే అందంత సులువు కాదు. కానీ కుప్పం, మంగళగిరిలో వైసీపీ గెలవబోతుందనే హడావిడి చేయడం ద్వారా ఇప్పటి నుంచి తండ్రీ కొడుకుల్ని సొంత నియోజకవర్గాల చుట్టూ తిరిగేలా చేస్తున్న జగన్.. స్ధానికంగా నేతల్ని ఆకర్షించడం సహా ఇతరత్రా కార్యక్రమాల ద్వారా వీలైనంతగా వారిని అక్కడే తిరిగేలా చేయాలనే వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే సొంత నియోజకవర్గాల్లో గెలుపు చేజారకుండా చూసుకునేందుకు వీరు ఫోకస్ పెడతారని, రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో గతంలోలా తిరిగేందుకు మొగ్గు చూపరని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications