బాబుకు ఓటేస్తే ఎలా మురిగిపోతుందంటే, నేను చూపిస్తా: జగన్, సీఎం అంటూ నినాదాలు
వైసిపి అధినేత వైయస్ జగన్ ఆదివారం కాకినాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన తొలుత అన్నమ్మ ఘాట్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
కాకినాడ: వైసిపి అధినేత వైయస్ జగన్ ఆదివారం కాకినాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన తొలుత అన్నమ్మ ఘాట్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబుకు ఇలా కౌంటర్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు మురిగిపోతుందని చంద్రబాబు చెప్పారని, కానీ టిడిపికి ఓటు వేస్తేనే మురిగిపోతుందనే విషయం ఆయనకు తెలియదని జగన్ విమర్శించారు. చంద్రబాబు తన పాలనలో చేసిందేమీ లేదన్నారు. బెల్టు షాపులు మూసేస్తానని వీధివీధికో షాపు పెట్టారన్నారు.

ఏడాది తర్వాత ఎన్నికలు
ఏడాదిలో ఎన్నికలు వస్తాయని జగన్ చెప్పారు. ఏడాది తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే అన్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాలలో వేటిని అమలు చేశారో చెప్పాలని నిలదీశారు. ఏడాది తర్వాత చంద్రబాబు పాలన ఉండదు కాబట్టి, టిడిపికి ఓటేస్తే మురిగిపోయినట్లే అన్నారు.

టిడిపికి వేస్తే ఎందుకు మురిగిపోతుందంటే.., నేను చూపిస్తా
ఏడాది తర్వాత ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చెప్పారని జగన్ గుర్తు చేశారు. ఆయన నంద్యాలలో ఈ విషయం చెప్పారన్నారు. ఇప్పుడు ఓటు వేసి వైసిపిని గెలిపిస్తే, ఏడాది తర్వాత రాష్ట్రంలోను, ఇక్కడా (కాకినాడ) వైసిపియే ఉంటుందన్నారు. కాకినాడలో అభివృద్ధి అంటే ఏమిటో నేను చేసి చూపిస్తానని జగన్ అన్నారు.

మూడున్నరేళ్లలో ఏం చేశారు, సీఎం జిందాబాద్ అని నినాదాలు
మూడున్నరేళ్లలో ఒక్క ఇల్లు కట్టించారా అని ప్రశ్నించారు. రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఏమైనా ఇచ్చారా అని నిలదీశారు. 38 నెలల తన పాలనలో చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రూ.78 వేలు బాకీ పడ్డారన్నారు. కరెంట్ బిల్లు, ఇంటి పన్ను అన్నీ పెంచారన్నారు. చంద్రబాబు జీవితంలో ఒక్క నిజం కూడా చెప్పరన్నారు. కాగా, జగన్ మాట్లాడుతుండగా అభిమానులు సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications