Condolence : దిలీప్ కుమార్ మృతిపై జగన్, చంద్రబాబు, గవర్నర్ సంతాపాలు-
బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ మృతి ఏపీలోనూ విషాదం నింపింది. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు, ప్రముఖులు దిలీప్ కుమార్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, గవర్నర్ హరిచందన్, విపక్ష నేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితం తమ సంతాప సందేశాలు విడుదల చేశారు.
దిలీప్ కుమార్ మృతిపై ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. బాలీవుడ్ ట్రాజెడీ కింగ్ మృతి తనను కలిచి వేసిందని గవర్నర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో దిలీప్ కుమార్ ఓ ట్రెండ్ సెట్టర్ అని కొనియాడారు. దిలీప్ కుమార్ ది విభిన్న శైలి అని, తన తర్వాతి తరం నటీనటులకు ఆయన మార్గదర్శకుడని గవర్నర్ పేర్కొన్నారు. ఐదు దశాబ్దాలకు మించి కెరీర్ కలిగిన యాక్టర్లలో మన దేశం అందించిన ఆణిముత్యాల్లాంటి నటుల్లో దిలీప్ కుమార్ ఒకరని గవర్నర్ తెలిపారు. దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం తెలిపారు.

అటు ఏపీ సీఎం వైఎస్ జగన్ దిలీప్ కుమార్ మృతిపై సంతాపం ప్రకటించారు. మొఘల్-ఏ-ఆజంలో సలీమ్ పాత్రతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారని దిలీప్ కుమార్ ను జగన్ కొనియాడారు. నయాదౌర్, మధుమతి, గంగా జమున శక్తి వంటి చిత్రాల్లో ఆయన నటన మర్చిపోలేనిదన్నారు. సాంస్కృతిక రంగంలో దిలీప్ కుమార్ లేని లోటు పూరించలేనిదని జగన్ తన సందేశంలో తెలిపారు. దిలీప్ కుమార్ మృతిపై ఆయన సతీమణి, నటి సైరా బానుకు, ఆయన అభిమానులకు, హితులకు జగన్ సంతాపం తెలిపారు.

Recommended Video
దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మృతిపై ఏపీ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. భారతీయ చలనచిత్ర రంగంలో మేటి నటుడిగా పేరు తెచ్చుకున్న దిలీప్ కుమార్ మృతి తనను ఎంతో కలిచివేసిందన్నారు. దశాబ్దాల పాటు సినీ అభిమానులపై తన నటనతో దిలీప్ కుమార్ చెరగని ముద్ర వేశారన్నారు. దిలీప్ మృతిపై ఆయన కుటుంబం, అభిమానులకు సంతాపం తెలుపుతున్నట్లు చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications