అనిల్ రావిపూడి మూవీలో వెంకటేష్ - కళ్యాణ్ రామ్ పాత్రలు ఇవే.. !
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరుసలో ఉంటుంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా మేళవిస్తూ ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించే దర్శకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. 'పటాస్' సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అనిల్ రావిపూడి.. అంతకుముందే పలు చిత్రాలకు రచయితగా, ఘోస్ట్ రైటర్‌గా పనిచేసి ఇండస్ట్రీలో తన ప్రతిభను నిరూపించుకున్నారు.
'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్2', 'సరిలేరు నీకెవ్వరు', 'ఎఫ్3', 'భగవంత్ కేసరి' వంటి వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఆయన కమర్షియల్ సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో వసూళ్ల సునామీ సృష్టిస్తూ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. 2025 సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించి వెంకటేష్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.

రూ.300 కోట్ల సంచలనం..
అయితే 2026 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో అనిల్ రావిపూడి తన కెరీర్‌లోనే మరో భారీ విజయాన్ని అందుకున్నారు. వింటేజ్ చిరంజీవిని ప్రేక్షకులకు చూపించిన ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. మాస్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్, వినోదం, భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
నెక్స్ట్ ప్రాజెక్ట్..
'మొదటి వంద కోట్ల బొమ్మ' ఇచ్చిన హీరో విక్టరీ వెంకటేష్‌తో, 'మొదటి అవకాశం' ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి 2027 తొలి పండగకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని అనిల్ రావిపూడి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించనున్న ఈ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు విభిన్నమైన ఇమేజ్‌లు కలిగిన హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించనుండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
బావ-బామ్మర్ది పాత్రల్లో వెంకీ, కళ్యాణ్ రామ్?
ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఇన్సైడ్ బజ్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ 'బావ-బామ్మర్ది' పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. వీరిద్దరి మధ్య సాగే సరదా సంభాషణలు, భావోద్వేగాలు, గొడవలు, అనుబంధం సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే కుటుంబ కథా చిత్రాల్లో వెంకటేష్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎన్నోసార్లు అలరించారు. మరోవైపు కళ్యాణ్ రామ్ తన ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ యాక్టింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే వినోదం ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
త్వరలో అధికారిక ప్రకటన
ఈ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్‌కు సంబంధించిన హీరోయిన్‌లు, విడుదల తేదీ వంటి పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు, షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications