Pingali Venkayya: పింగళికి ఏపీ ఘన నివాళి-జగన్ పతాకావిష్కరణ-చంద్రబాబు, పవన్ నివాళి..
జాతీయ పతాక రూపశిల్పి, తెలుగు వాడైన దివంగత పింగళి వెంకయ్యకు ఏపీ ఘన నివాళులు అర్పించింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన అధినేతలు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దేశానికి పింగళి సేవల్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146 వ జయంతి ఉత్సవాలను సీఎం వైఎస్ జగన్ ఇవాళ ప్రారంభించారు.

ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన సీఎం జగన్.. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ళ మల్లిఖార్జునరావు స్వయంగా చిత్రించిన పింగళి వెంకయ్య చిత్రపటాన్ని జగన్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

మరోవైపు తన మరదలు ఉమామహేశ్వరి ఆకస్మిక మరణంతో హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అక్కడి నుంచి పింగళి వెంకయ్య సేవల్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. భారతావని స్వాతంత్ర అమృతోత్సవాలుజరుపుకుంటున్న వేళ హర్ ఘర్ తిరంగా అంటూ ఇంటింటా మువ్వన్నెల పతాకం ఎగరేసేందుకు దేశం పిలుపునివ్వడం తెలుగుజాతికి పింగళి వెంకయ్యగారు సాధించిపెట్టిన గౌరవం అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో భారత జాతీయ పతాక రూపకర్త, తెలుగుజాతి కీర్తి కెరటం పింగళి వెంకయ్య గారి 146వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు. జాతీయోద్యమంలోనే కాకుండా విద్య, శాస్త్రీయ రంగాల్లో దేశానికి సేవలందించిన పింగళి వారి బహుముఖ సేవల్ని దేశభక్తిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

మూడు వర్ణాలతో మురిపించే భారత జాతీయ పతాకం.. భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమానానికి, సార్వభౌమత్వానికి, సమున్నతకి ప్రతీకని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. మన త్రివర్ణ పతాకాన్ని వీక్షించిన మరుక్షణం శరీరం రోమాంచితం కాని భారతీయులు ఉండరంటే అది అతిశయోక్తి కాదన్నారు. ఇది అక్షర సత్యమన్నారు. అంతటి శక్తి కలిగిన పతాకాన్ని రూపొందించిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గారు చరితార్థుడని పవన్ కొనియాడారు. ఆ పతాక తపశ్శాలి తెలుగు గడ్డపై జన్మించడం తెలుగు జాతి పుణ్యఫలమన్నారు. ఆ మహానుభావుని 146వ జయంతి సందర్భాన తన పక్షాన, జనసేన పార్టీ పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నానని పవన్ తెలిపారు. ఆ త్యాగశీలికి 'భారతరత్న'పురస్కారం అందించాలని తెలుగు ప్రజల కోరిక. అది ఇంతవరకు నెరవేరలేదన్నారు. దేశంలో 'ఆజాది కా అమృతోత్సవ్' వేడుకలు జరుగుతున్న ఈ శుభ ఘడియలలో శ్రీ పింగళి వెంకయ్య గారి సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని బీజేపీని పవన్ కోరారు.












Click it and Unblock the Notifications