ప్రముఖ వ్యూహకర్తతో జగన్ మంత్రాంగం - 2019 ఫార్ములా రిపీట్..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీని తిరిగి క్షేత్ర స్థాయి నుంచి పూర్తి స్థాయి లో బలోపేతం చేయటం పైన ఫోకస్ చేసారు. తాజాగా జరిగిన పీఏసీ సమావేశంలోనూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ సభ్యత్వం.. భీమా సదుపాయం గురించి పార్టీలో కసరత్తు కొన సాగుతోంది. ఇదే సమయంలో జిల్లాల అధ్యక్షుల నియామకం పూర్తి చేస్తున్నారు. జిల్లాల పర్యటన లకు సిద్దం అవుతున్నారు. ఇక, సోషల్ ఇంజనీరింగ్ విషయంలో 2024 లో అంచనాలు తప్పిన జగన్.. ఇప్పుడు ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా తాజా నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
కూటమి లక్ష్యంగా
మాజీ సీఎం జగన్ ఓటమి నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నారు. వై నాట్ 175 అనే నినాదంతో 2024 ఎన్నికల బరిలోకి దిగిన జగన్ దారుణమైన ఓటమి పాలయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతోంది. ఈ కాలంలో తాను ఎక్కడ దెబ్బ తిన్నదీ.. ఏ నిర్ణయాలు తనకు ఈ ఫలితానికి కారణమయ్యాయనేది జగన్ విశ్లేషించారు. దీంతో..తన నిర్ణయాలను మార్చుకుంటూ వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ముందుగా పార్టీ ప్రక్షాళన - బలోపేతం పైన ఫోకస్ చేసా రు. జిల్లాల అధ్యక్షుల నుంచి పీఏసీ వరకు సామాజిక - ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఒక ప్రముఖ వ్యూహకర్తతోనూ కొంత కాలంగా మంత్రాంగం సాగిస్తున్నట్లు సమాచారం.

2019 ఫార్ములాతో
2019 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్ జగన్ కోసం పని చేసారు. ఆ తరువాత దూరమయ్యారు. 2024 లో రిషి రాజ్ సింగ్ పని చేసినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు, బెంగళూరు కేంద్రంగా ఈ వ్యూహకర్తతో భవిష్యత్ కార్యాచరణ డిసైడ్ చేస్తున్నట్లు సమాచారం.
2024 ఎన్నికల సమయంలో జగన్ కొత్త తరహా సోషల్ ఇంజనీరింగ్ పేరుతో సరికొత్త సమీకరణాల ను అమలు చేసారు. అభ్యర్ధుల నియోజకవర్గాల మార్పు - టికెట్ల ఖరారు లో చేసిన ప్రయోగాలు బెడిసి కొట్టాయి. దీంతో, ఇప్పుడు తిరిగి తనకు దూరమైన వర్గాలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాల అధ్యక్షుల నియామకం.. కూటమికి మూలాలుగా ఉన్న వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా గోదావరి, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో జగన్ 2019 లో అన్ని సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేలా టికెట్ల కేటాయింపు.. పార్టీలో బాధ్యతలు...వరుస సమావేశాలు..వారి అవసరాలకు అనుగుణంగా హామీలు ఇచ్చి.. అందరి మద్దతు పొందారు.
ఓటమితో మారిన రూటు
ఫలితంగా పవన్ పార్టీ పోటీలో ఉన్నా.. మెజార్టీ కాపు ఓటింగ్ వైసీపీకే దక్కింది. టీడీపీ 23 సీట్లకు పరిమితం కాగా, జగన్ కు 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు తిరిగి జగన్ అందరివాడుగా మారాలని ప్రయత్నిస్తున్నారు. పార్టీ నియామకాల్లో గత అయిదేళ్లు నిర్ణయానికి భిన్నంగా తాజాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ కేడర్ కు దూరం కావటంతో జరిగిన నష్టం గుర్తించారు. ఇప్పుడు కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యత పదే పదే చెబుతున్నారు. వచ్చే నెల నుంచి తాడేపల్లిలో కార్యకర్తలకు.. ప్రజలకు అందుబాటులో ఉండాలని డిసైడ్ అయ్యారు. జూన్ నుంచి జిల్లాల పర్య టనలు ప్రారంభించాలని జగన్ నిర్ణయించారు. దీంతో.. ఇప్పుడు జగన్ తిరిగి 2019 తరహాలో అమలు చేస్తున్న ఇంజనీరింగ్ ఎంత వరకు కలిసి వస్తుందనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications